నందమూరి కుటుంబం గురించి మాట్లాడితే బాలకృష్ణ, హరికృష్ణ మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఇద్దరి మధ్య ఎంత ప్రేమ, గౌరవం ఉండేదో.. అంతే క్రమశిక్షణ కూడా ఉండేదట. ఒక సందర్భంలో బాలకృష్ణను హరికృష్ణ కర్రతో పరిగెత్తించి కొట్టిన ఘటన గురించి స్వయంగా బాలయ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంతకీ బాలయ్య చేసిన తప్పేంటి? హరికృష్ణ ఎందుకు అంత కోపం తెచ్చుకున్నారో తెలుసుకుందాం.
నందమూరి లెగసీని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో ఆయన కెరీర్ మరో స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా 'అఖండ' తర్వాత విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించడంతో పాటు నిర్మాతలకు కూడా మంచి లాభాలు తీసుకొచ్చాయి. తెరపై ఎంత పవర్‌ఫుల్‌గా కనిపించినా, కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం బాలయ్య ఎంతో భావోద్వేగంతో ఉంటారని ఆయన చెప్పిన సంఘటనలు చెబుతుంటాయి.
ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ తన అన్న నందమూరి హరికృష్ణ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తండ్రి ఎన్టీఆర్ షూటింగ్‌లు, రాజకీయాలతో బిజీగా ఉండే రోజుల్లో హరికృష్ణే తమకు తండ్రిలా చూసుకునేవారని చెప్పారు. ప్రేమతో పాటు క్రమశిక్షణ విషయంలో కూడా ఆయన చాలా కఠినంగా ఉండేవారని, కొన్నిసార్లు నాన్న కూడా హరికృష్ణ మాటకు ప్రాధాన్యం ఇచ్చేవారని బాలయ్య గుర్తు చేసుకున్నారు. కుటుంబంలో అందరికీ ఆయనపై ఎంతో గౌరవం, కొంత భయం కూడా ఉండేదని తెలిపారు.
ఒకసారి తమ సొంత ఊరికి వెళ్లిన సమయంలో జరిగిన సంఘటనను బాలయ్య గుర్తు చేసుకున్నారు. ఇంటికి వెళ్లగా తాత మాత్రమే ఉండటంతో హరికృష్ణ ఎక్కడ ఉన్నారని అడిగితే పొలం వద్ద ఉన్నాడని చెప్పారట. అక్కడికి వెళ్లి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మన పొలం ఎలా ఉంది అన్నయ్య? అని బాలయ్య అడిగారట. వెంటనే హరికృష్ణకు కోపం వచ్చి "మన పొలం అంటావా? ఈ పొలం కోసం నువ్వు కష్టపడ్డావా? పని చేశావా?" అంటూ కర్ర తీసుకుని బాలయ్యతో పాటు మిగతా అన్నదమ్ములను ఇంటివరకు పరిగెత్తిస్తూ కొట్టారట. ఆ సంఘటనను బాలయ్య గుర్తు చేసుకున్నారు. ఈ ఘటన హరికృష్ణ వ్యక్తిత్వంలో ఉన్న నిజాయితీ, కష్టానికి ఇచ్చే విలువ, కుటుంబ సభ్యులపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా నిలిచిపోయింది.




















