సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై పుకార్లు కొత్తేమీ కాదు. హీరో, హీరోయిన్ కలిసి కనిపించినా.. కాస్త సన్నిహితంగా మాట్లాడినా వారి మధ్య ఏదో ఉందంటూ కథనాలు వైరల్ చేస్తుంటారు. తాజాగా నటుడు జయరామ్, సీనియర్ నటి సిమ్రాన్ విషయంలోనూ ఇలాంటి ప్రచారమే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
జయరామ్ తెల్లటి పంచె, చొక్కాలో.. సిమ్రాన్ ఎరుపు రంగు పట్టుచీరలో మెడలో పూలదండలతో ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు. మరికొందరు వారికి శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న ఫొటోలు ఓ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించినవి. ఈ చిత్రంలో జయరామ్, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. సినిమా పూజా కార్యక్రమానికి సంప్రదాయ దుస్తుల్లో హాజరైన ఇద్దరినీ చిత్ర నిర్మాణ సంస్థ పూలదండలతో సత్కరించింది. ఆ సమయంలో తీసిన ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో వక్రీకరించి.. జయరామ్, సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారంటూ ప్రచారం చేశారు. దీంతో సినిమా ప్రారంభోత్సవ వేడుక కాస్తా రహస్య వివాహ వేడుకగా మారిపోయింది.
నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి పుకార్లను ప్రచారం చేయడం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలు విషయం తెలియడంతో.. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Loading Tweet...




















