సూరత్,అక్టోబర్ 5 జనవాణి): గుజరాత్‌లోని సూరత్‌లో సోషల్ మీడియా రీల్ వ్యవహారం వివాదంగా మారింది. మహాత్మా గాంధీ చిత్రంతో ఉన్న రూ.500 కరెన్సీ నోటును అసభ్యకరంగా హ్యాండిల్ చేస్తూ రీల్ చేసిన ఆరోపణలపై మహిళా కంటెంట్ క్రియేటర్ సిమ్రాన్ పటేల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సిమ్రాన్ పటేల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ రీల్స్ చేసి పోస్టులు చేస్తుంటారు. ఈ నెల 1న రూ.500 నోటుతో ఆమె ఓ రీల్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే, ఆ వీడియోలో అసభ్యకరమైన కంటెంట్, విజువల్స్, సంజ్ఞలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సిమ్రాన్ ఇంటికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సామాజిక కార్యకర్త ధర్మేష్ గామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమెపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు.
అరెస్టు అనంతరం సిమ్రాన్ తన చర్యకు క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా సూరత్ పోలీసులు ‘రీల్‌కు ముందు.. రీల్ తర్వాత’ పేరుతో ఎక్స్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. అందులో సిమ్రాన్ తన చేసిన పనికి క్షమాపణలు చెబుతున్న దృశ్యాలు ఉన్నాయి. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా లేదా అభ్యంతరకరంగా ఉండే రీల్స్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దని సూరత్ పోలీసులు ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేసే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు.




















