అన్నయ్య పుట్టిన రోజు కోసం నాగబాబు కోకాపేటలో...

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు, నటుడు, నిర్మాత, ఏపీ శాసనమండలి సభ్యుడు కొణిదెల నాగబాబు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ కోకాపేటలో అభిమానులు, సినీ ప్రముఖులను ఆకట్టుకునేలా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

22 ఆగస్టు, 2026 2:26 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అన్నయ్య పుట్టిన రోజు కోసం నాగబాబు కోకాపేటలో...

హైదరాబాద్, ఆగస్టు 22 (జనవాణి): మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోదరుడు నాగబాబు మొక్కలు నాటుతూ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ప్రియమైన వారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటాలని ఆయన కోరారు.

తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ (కదంబవాసిని) మొక్కలను నాటారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. కదంబ మొక్కలు ఏపుగా పెరిగి దట్టమైన పచ్చదనాన్ని అందించడంతో పాటు, చుట్టుపక్కల ఉష్ణోగ్రతను దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు తగ్గించే చల్లని నీడను ఇస్తాయని తెలిపారు. సుమారు 1.5 నుంచి 2 సంవత్సరాల వయసున్న మొక్కలు పెరిగిన తర్వాత టెన్నిస్ బాల్ ఆకారంలో ఉండే సువాసనభరితమైన పూలతో ఆకట్టుకుంటాయని వివరించారు.

అన్నయ్య చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని మొక్కలు నాటడం తనకు ఎంతో సంతోషం, సంతృప్తిని ఇచ్చిందని నాగబాబు అన్నారు. పుట్టినరోజు వేడుకలను తాత్కాలిక ఆడంబరాలకు పరిమితం చేయడం కంటే.. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణాన్ని అందించేలా ఒక చెట్టును నాటడం మరింత అర్థవంతమైన వేడుక అని పేర్కొన్నారు. ఈ రోజు మనం చేసే చిన్న ప్రయత్నం.. రేపటి సమాజానికి అందించే గొప్ప బహుమతిగా మారుతుందని నాగబాబు పేర్కొన్నారు. తాము నాటిన మొక్కల మాదిరిగానే చిరంజీవి కీర్తి, ప్రేరణ నిరంతరం ఎదుగుతూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కుటుంబ సంప్రదాయంలో భాగంగా మెగా కుటుంబ సభ్యుల పేర్లతో ఇప్పటివరకు 120కి పైగా మొక్కలు నాటినట్లు నాగబాబు వెల్లడించారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక తదితరుల పేర్లతో మొక్కలు నాటినట్లు తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు