విజయవాడ, సెప్టెంబర్ 8 (జనవాణి): మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆలయ ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆమెను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నియామకంతో సుస్మిత ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి కానున్నారు. ముఖ్యంగా భక్తులకు కల్పిస్తున్న వసతులు, ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, దసరా నవరాత్రులు వంటి ప్రధాన ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ట్రస్ట్ బోర్డుకు తన సూచనలు, సలహాలు అందించనున్నారు. మరోవైపు సుస్మిత కొణిదెల ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇటీవల తన తండ్రి చిరంజీవితో కలిసి నిర్మించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో ఆమె మంచి విజయాన్ని అందుకున్నారు.
ఇక సుస్మిత కుటుంబానికి ఆలయ సేవలతోనూ అనుబంధం ఉంది. ఆమె తల్లి కొణిదెల సురేఖ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. ఇప్పుడు సుస్మితకు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయమైన కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా అవకాశం దక్కడం విశేషంగా మారింది.




















