మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ‘కాకా’ గ్లింప్స్ మాస్ ట్రీట్ ఇచ్చింది. బాబీ కొల్లి దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి కే. సత్యం అనే పాత్రలో కనిపించనున్నారు. ఆక్వా పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ కుటుంబ బాధ్యతలను చూసుకునే మధ్య వయస్కుడిగా సత్యం పాత్రను గ్లింప్స్‌లో పరిచయం చేశారు. అయితే కుమార్తె స్కూటర్ తాళాలు నీటిలో పడిపోవడంతో వాటిని తీసేందుకు భారీ అయస్కాంతాన్ని ఉపయోగించగా.. తాళాలతో పాటు తుపాకులు బయటకు రావడం కథను ఒక్కసారిగా మలుపు తిప్పుతుంది.
అసలు సత్యం గతం ఏంటి? తుపాకులతో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ‘కాకా’ టైటిల్‌ను రివీల్ చేశారు. ఆ తర్వాత గ్లింప్స్ పూర్తిగా మాస్ యాక్షన్ మూడ్‌లోకి మారుతుంది. యువ చిరంజీవి సరికొత్త లుక్‌లో ఒంటి చేత్తో తుపాకీ పట్టుకుని వరుసగా కాల్పులు జరుపుతూ ఆకట్టుకున్నారు. ఒకే పాత్రలో రెండు భిన్నమైన షేడ్స్‌ను చూపించడం గ్లింప్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాధారణ వ్యక్తిగా చిరంజీవి హావభావాలు సహజంగా కనిపించగా.. యువకుడి పాత్రలో ఆయన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, తమన్ నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చాయి. సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతోంది. కథకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకుండా.. హీరో పాత్రలోని రెండు కోణాలను మాత్రమే చూపించిన గ్లింప్స్ ‘కాకా’పై ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రం 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.




















