ఎన్ని సార్లు విన్నా, చూసినా కానీ.. మళ్లీ మళ్లీ వినాలనిపించే, చూడాలనిపించే గొప్ప ఇతిహాసాల్లో రామాయణం ఒకటి. ఇప్పటికే ఈ కథను వెండితెరపై పదుల సార్లు చూసుంటాం. అయినా సరే మరోసారి కొత్తగా తీస్తున్నారంటే చూస్తాం. అంతటి గొప్ప కథ ఇది. ఇలాంటి దృష్య కావ్యాన్ని దర్శకుడు నితీష్ తివారి 'రామాయణ' పేరుతో దాదాపు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా.. సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ తెగ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఆడియో హక్కుల డీల్ హాట్ టాపిక్‌గా మారింది.
'రామాయణ' రెండు భాగాల ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ-సిరీస్ దాదాపు రూ.75 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. సినిమా రిలీజ్‌కు ముందే ఇంత భారీ మొత్తానికి ఆడియో హక్కులు అమ్ముడవ్వడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చగా మారాయి. ఈ డీల్‌తో సినిమాపై ఉన్న అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాలో యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనుండగా రవి దూబే లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. రామాయణ కథను ఆధునిక సాంకేతికతతో భారీ స్థాయిలో చూపించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో మొదటి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా నవంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రెండో భాగాన్ని 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే నటీనటులు, భారీ బడ్జెట్, గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన ఈ సినిమాకు ఇప్పుడు రూ.75 కోట్ల ఆడియో డీల్ కూడా తోడవడంతో విడుదలకు ముందే 'రామాయణ'పై మరింత హైప్ పెరిగింది.




















