రివ్యూ: కొరియన్ కనకరాజు.. వరుణ్ తేజ్‌కు కావాల్సిన హిట్ దొరికిందా?

వరుస పరాజయాలతో సతమతవువుతున్న వరుణ్ తేజ్.. ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు పూర్తిగా కొత్తదైన హారర్ కామెడీ జానర్‌ను ఎంచుకుని 'కొరియన్ కనకరాజు'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సినిమా నిజంగానే వరుణ్‌కు కంబ్యాక్ ఇచ్చిందా? చూద్దాం.

7 ఆగస్టు, 2026 12:51 PM•ByRalin

Share this article

రివ్యూ: కొరియన్ కనకరాజు.. వరుణ్ తేజ్‌కు కావాల్సిన హిట్ దొరికిందా?

వరుస పరాజయాలతో సతమతవువుతున్న వరుణ్ తేజ్.. ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు పూర్తిగా కొత్తదైన హారర్ కామెడీ జానర్‌ను ఎంచుకుని 'కొరియన్ కనకరాజు'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరోవైపు కామెడీ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వం, ట్రైలర్‌లో కనిపించిన కొత్త కాన్సెప్ట్ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి ఈ సినిమా నిజంగానే వరుణ్‌కు కంబ్యాక్ ఇచ్చిందా? చూద్దాం.

కథ

అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన కనకరాజు (వరుణ్ తేజ్) కోపం ఎక్కువగా ఉండే యువకుడు. చెక్కభజన బృందంతో ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగిస్తుంటాడు. తన స్నేహితుడు కిష్టప్ప (సత్య)తో కలిసి ఊరిలో సరదాగా తిరుగుతుంటాడు. కియా కంపెనీలో పనిచేసే చైత్ర (రితికా నాయక్)ను ప్రేమిస్తాడు.

అదే సమయంలో కొరియాలో మరణించిన ఓ గ్యాంగ్‌స్టర్ ఆత్మ అనుకోకుండా కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి అతని ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. కొన్నిసార్లు రాయలసీమ యువకుడిలా, మరికొన్నిసార్లు కొరియన్ గ్యాంగ్‌స్టర్‌లా ప్రవర్తిస్తుంటాడు. కొరియన్ భాష మాట్లాడటం, విచిత్రంగా వ్యవహరించడం చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశ్చర్యపోతారు.

ఆ ఆత్మకు సంబంధించిన రహస్యం తెలుసుకునే క్రమంలో అది కొరియా అండర్‌వ‌రల్డ్‌తో సంబంధం ఉన్న వ్యక్తిదని బయటపడుతుంది. ఆ ఆత్మకు విముక్తి కల్పించాలంటే కనకరాజు కొరియా వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అతను ఎదుర్కొన్న పరిస్థితులు, ఆ గ్యాంగ్‌స్టర్ గతం, చివరకు ఆ ఆత్మ కోరిక నెరవేరిందా? కనకరాజు సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చాడా? అనేదే మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే..

హారర్ కామెడీ జానర్‌లో కథ ఎంత కొత్తగా ఉందన్నదానికంటే, ప్రేక్షకుడిని ఎంత ఎంటర్‌టైన్ చేశామనేదే ముఖ్యం. అదే విషయాన్ని దర్శకుడు మేర్లపాక గాంధీ మొదటి నుంచే అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. లాజిక్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా నవ్వించే సన్నివేశాల మీదే ప్రధానంగా దృష్టి పెట్టాడు.

సినిమా మొదటి భాగం పూర్తిగా పాత్రల పరిచయానికే కేటాయించాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్, కనకరాజు కుటుంబం, చైత్రతో ప్రేమకథ, కిష్టప్పతో స్నేహం, చెంగా రెడ్డి గ్యాంగ్‌తో గొడవలు... ఇలా కథను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తాడు. అయితే ట్రైలర్‌లోనే అసలు కథను చూపించేయడంతో ప్రేక్షకుడు కొరియన్ ఆత్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాడు. అందుకే ఫస్ట్ హాఫ్‌లో కొంత నత్తనడక కనిపిస్తుంది.

కానీ ఆత్మ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా పూర్తిగా గేర్ మార్చేస్తుంది. వరుణ్ తేజ్ హావభావాలు, కొరియన్ భాషలో మాట్లాడే సన్నివేశాలు, వాటికి సత్య ఇచ్చే రియాక్షన్లు నవ్వులు పంచుతాయి. ముఖ్యంగా వరుణ్–సత్య కాంబినేషన్ సినిమాకు అతి పెద్ద ప్లస్. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు, పరిస్థితులు సహజంగా ఉండటంతో కామెడీ బాగా పేలింది.

ఇంటర్వెల్ బ్లాక్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కొరియన్ గ్యాంగ్‌స్టర్ గతాన్ని రివీల్ చేస్తూ కథను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇండో-కొరియన్ నేపథ్యాన్ని ఉపయోగించుకున్న తీరు కొత్తగా అనిపిస్తుంది. కొరియాలోని లొకేషన్లు, గ్యాంగ్‌స్టర్ ఎపిసోడ్స్ సినిమాకు రిచ్ ఫీల్ తీసుకొచ్చాయి.

అయితే ఇక్కడే స్క్రీన్‌ప్లే కొంత తడబడింది. గ్యాంగ్‌స్టర్ ఫ్లాష్‌బ్యాక్ కొంచెం ఎక్కువసేపు సాగడం, కొన్ని సన్నివేశాలు రిపీట్ అనిపించడం వల్ల వేగం తగ్గుతుంది. ఆత్మల కథల్లో లాజిక్ ఆశించకూడదనుకున్నా, కొన్ని చోట్ల ఫాంటసీ ఎలిమెంట్స్ మరీ అతిగా అనిపిస్తాయి.

సినిమాలో మరో పెద్ద హైలైట్ వీడియో కాల్‌లో జరిగే క్షుద్రపూజ ఎపిసోడ్. అలాగే సత్య, మురళీధర్ గౌడ్ కలిసి చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రీ-క్లైమాక్స్ వరకు దర్శకుడు వినోదాన్ని నిలబెట్టగలిగాడు.

కానీ క్లైమాక్స్ మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టు లేదు. ఆత్మల మధ్య పోరాటం, విజువల్ ఎఫెక్ట్స్, ఫాంటసీ సన్నివేశాలు మరింత మెరుగ్గా ఉండాల్సింది. భావోద్వేగం కూడా అంతగా కనెక్ట్ కాదు. దీంతో మంచి ఎంటర్‌టైనర్‌గా సాగిన సినిమా ముగింపు దగ్గర కొంత బలహీనపడుతుంది.

ఎవరెలా చేశారంటే..

ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌లో భిన్నమైన పాత్రగా చెప్పొచ్చు. రాయలసీమ యువకుడిగానూ, కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ప్రభావంలో పూర్తిగా మారిపోయే వ్యక్తిగానూ రెండు షేడ్స్‌లో అద్భుతమైన ఎనర్జీ చూపించాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. కామెడీ జానర్‌లో కూడా తాను రాణించగలనని నిరూపించాడు.

సత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఈ సినిమాకు అసలైన సర్‌ప్రైజ్ ప్యాకేజ్ అతనే. దాదాపు ప్రతి సన్నివేశంలో తన టైమింగ్‌తో నవ్వులు పంచాడు. వరుణ్‌తో అతని కెమిస్ట్రీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.

రితికా నాయక్ పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్‌తో పాటు కథలో అవసరమైన చోట బాగానే నటించింది. మురళీధర్ గౌడ్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సునీల్, శ్రీనివాస్ అవసరాల, వీటీవీ గణేష్, బుల్లిరాజు తమ పాత్రల పరిధిలో నటించారు.

సాంకేతికంగా ఎలా ఉందంటే..

మేర్లపాక గాంధీ కథ కంటే వినోదానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. చాలాచోట్ల ఆ ప్రయత్నం ఫలించింది. అయితే స్క్రీన్‌ప్లేలో మరింత జాగ్రత్తగా ఉండాల్సింది. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద బలం. హారర్, కామెడీ రెండింటినీ సమతుల్యం చేస్తూ మంచి స్కోర్ ఇచ్చాడు. పాటలు కమర్షియల్‌గా బాగున్నాయి.

మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. ముఖ్యంగా కొరియా విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్

* వరుణ్–సత్య కాంబినేషన్

* తమన్ నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్

* రొటీన్ కథ, సాగదీత సన్నివేశాలు

* క్లైమాక్స్

చివరగా.. లాజిక్‌లను పక్కనబెడితే.. హాయిగా నవ్వుకోవచ్చు!

▶CategoriesCinema, News and Entertainment
▶Follow us onFacebook, Twitter & Instagram.
Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు