హైదరాబాద్, సెప్టెంబర్ 29 (జనవాణి): బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజు (37)కి మరో ఇద్దరు సహకరించినట్లు మల్కాజ్‌గిరి పోలీసులు గుర్తించారు. ఆయుధాగారం ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేసిన వినోద్, శేషులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మల్లేశ్, వినోద్ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మరోవైపు 10 రోజుల పోలీసు కస్టడీలో ఉన్న మల్లేశ్‌ను అధికారులు 8వ రోజు విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం అతడిని మద్రాస్ రెజిమెంట్‌కు తీసుకెళ్లారు.
12 తుపాకులు, 1,912 రౌండ్ల బుల్లెట్లు చోరీ
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆగస్టు 30, 31 మధ్య రాత్రి భారీ ఆయుధాల చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాగారం నుంచి 12 తుపాకులు, 21 మ్యాగజైన్లు, నైట్ విజన్ బైనాక్యులర్‌తో పాటు 1,912 రౌండ్ల బుల్లెట్లను ఎత్తుకెళ్లారు.
ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మిలిటరీ ఇంటెలిజెన్స్, ఎన్‌ఐఏ, మల్కాజ్‌గిరి పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో మాజీ హవల్దార్ మల్లేశ్‌ను నిందితుడిగా గుర్తించారు. ఈ నెల 11న మల్లేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి స్వగ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ భూమిలో పాతిపెట్టిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఉద్యోగం నుంచి తొలగించడంతోనే చోరీ?
ఉద్యోగం నుంచి తొలగించడంతో మల్లేశ్ ఈ చోరీకి పాల్పడినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు కోర్టు అనుమతితో అతడిని 10 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో మల్లేశ్‌కు సహకరించినట్లు అనుమానిస్తున్న మరో ఇద్దరి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మల్లేశ్‌తో వారి సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, ఆయుధాల చోరీలో వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.




















