పక్కా ప్రణాళికతోనే శాసనసభ వద్ద బీఆర్‌ఎస్‌ నేతల హంగామా.. మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

శాసనసభ వద్ద సోమవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్వహించిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ఫిర్యాదుల ఆధారంగా కేటీఆర్‌, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. భద్రతా సిబ్బందిపై దాడి, మహిళా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, బెదిరింపులు, స్పీకర్‌ను దూషించడం వంటి ఆరోపణలు కేసుల్లో నమోదయ్యాయి.

9 సెప్టెంబర్, 2026 10:30 AM•ByNarender Kumar Nangunoori

Share this article

పక్కా ప్రణాళికతోనే శాసనసభ వద్ద బీఆర్‌ఎస్‌ నేతల హంగామా.. మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (జనవాణి): శాసనసభ వద్ద సోమవారం ఉదయం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై పోలీసుల ఫిర్యాదుల మేరకు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. భద్రతా సిబ్బందిపై దాడి, మహిళా పోలీసులతో అనుచితంగా ప్రవర్తించడం, బెదిరింపులకు పాల్పడటం, స్పీకర్‌ను దూషించడం వంటి ఆరోపణలను పోలీసులు కేసుల్లో పేర్కొన్నారు.

ఒక మహిళా కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో.. బీఆర్‌ఎస్‌ నేతలు నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీ గేటు వద్దకు వచ్చారని పోలీసులు తెలిపారు. రాజకీయ నినాదాలతో ఉన్న చొక్కాలు ధరించిన వారిని లోపలికి అనుమతించబోమని చెప్పడంతో వాగ్వాదం జరిగినట్లు పేర్కొన్నారు. హరీశ్‌రావు మహిళా కానిస్టేబుళ్లను అడ్డంపెట్టుకుని చవకబారు రాజకీయాలు చేస్తున్నారా? అని బిగ్గరగా అరిచారు. అదే సమయంలో కేటీఆర్‌ కూడా మహిళలను అడ్డు పెట్టుకుని సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నది ఎవరు? ఇక్కడ డీసీపీ ఎవరు? అని అవమానించారు. ఈ వ్యాఖ్యలు మహిళా పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. తర్వాత హరీశ్‌రావు చొక్కాను విప్పి ఒక పోలీసు అధికారివైపు విసిరి, అర్ధనగ్నంగా నిలబడ్డారు. ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి మహిళా పోలీసులను ఎక్కడ పెడతారని అరిచారు. అదేవిధంగా కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు చొక్కాలు విప్పి నిరసన తెలిపారని, మహిళా పోలీసులకు అత్యంత సమీపంలో నిలబడటంతో తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు మహిళా సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక మహిళా కానిస్టేబుల్‌ను నెట్టడంతో ఛాతీ భాగంలో నొప్పి కలిగి ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. ఈ ఫిర్యాదు ఆధారంగా హరీశ్‌రావు తదితరులపై బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులపై దాడి ఆరోపణలు

మరో పోలీసు అధికారి ఫిర్యాదు మేరకు కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై మరో కేసు నమోదైంది. మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి పంపించే సమయంలో వారి వెనుక సుధీర్‌రెడ్డి, కమలాకర్‌, హరీశ్‌రావు తదితరులు దాక్కొని బలవంతంగా గేటు దాటేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులపై భౌతిక బలం ప్రయోగించారని, ఒక అధికారి కిందపడిపోయారని పోలీసులు ఆరోపించారు. కేటీఆర్‌ ఓ పోలీసు అధికారి కాలర్‌ పట్టుకున్నారని, కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి తదితరులు పోలీసులతో ఘర్షణకు దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులను బెదిరించేలా కూడా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు.

స్పీకర్‌ను దూషించారంటూ ఆరోపణలు

స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా దూషించారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి అసెంబ్లీ బందోబస్తులో ఉన్న ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌, అసెంబ్లీ మార్షల్స్‌, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మీడియా ఉన్న ప్రాంతంలోనే ఉద్దేశపూర్వకంగా హంగామా చేశారని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. మొత్తంగా శాసనసభ వద్ద జరిగిన నిరసనపై పోలీసుల ఫిర్యాదులతో మూడు కేసులు నమోదవడంతో రాజకీయంగా ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు