బలోద్,సెప్టెంబర్ 25 (జనవాణి): ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాన్ని వేగంగా వచ్చిన 16 టైర్ల భారీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కబీర్‌ధామ్ జిల్లాకు చెందిన ‘ధుమాల్’ మ్యూజిక్ బ్యాండ్ కళాకారులు తమ సంగీత వాయిద్యాలతో చిన్న సరకు రవాణా వాహనంలో జగదల్‌పూర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో బలోద్ జిల్లా పురూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధమతరి-కంకేర్ జాతీయ రహదారి-30పై మర్కాటోలా ఘాట్ వద్ద వారి వాహనం చెడిపోయింది. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి ఉంచి మరమ్మతులు చేసుకుంటుండగా రాయ్‌పూర్ నుంచి జగదల్‌పూర్ వైపు వరి ధాన్యంతో వెళ్తున్న 16 టైర్ల భారీ ట్రక్కు అదుపుతప్పి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఢీకొన్న ధాటికి ట్రక్కు సైతం రోడ్డుపైనే బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిలో మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా రహదారి బురదమయంగా మారడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.




















