ఈ ఎస్సై మామూలోడు కాదు.. సోషల్ మీడియాతో మహిళలను టార్గెట్ చేసిన వైనం

ఫేస్‌బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎస్సై కదిరే శ్రీకాంత్‌ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.

1 ఆగస్టు, 2026 6:47 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఈ ఎస్సై మామూలోడు కాదు.. సోషల్ మీడియాతో మహిళలను టార్గెట్ చేసిన వైనం

Janavaani

హనుమకొండ, ఆగస్టు 1: ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై మహిళలను సోషల్ మీడియా ద్వారా వేధించినట్లు ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఫేస్‌బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని, లైంగిక వేధింపులు, బెదిరింపులు, డబ్బుల కోసం ఒత్తిడి చేసిన కేసులో ఎస్సై కదిరే శ్రీకాంత్ ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన శ్రీకాంత్ 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై. వివాహితుడైన అతను ఫేస్‌బుక్ ద్వారా మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి పరిచయాలు పెంచుకునేవాడని దర్యాప్తులో వెల్లడైంది. 2025లో ఓ మహిళతో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్న శ్రీకాంత్.. అనంతరం ఆమె వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి వ్యక్తిగత ఫొటోలు, వీడియో కాల్ రికార్డులను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడని, డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఇచ్చిన డబ్బును తిరిగి అడగగా తీవ్రంగా బెదిరించినట్లు కూడా ఆరోపించారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు హనుమకొండ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న శ్రీకాంత్ పరారయ్యాడు. సుమారు నాలుగు నెలల పాటు గోవా, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మొబైల్ సిమ్ కార్డులను ధ్వంసం చేసి, కేవలం Wi-Fi ద్వారానే కమ్యూనికేషన్ కొనసాగించినట్లు విచారణలో వెల్లడైంది. సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో అతని కదలికలను గుర్తించిన పోలీసులు.. చివరకు నిజామాబాద్‌లో అదుపులోకి తీసుకుని హనుమకొండకు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు