హైదరాబాద్, సెప్టెంబర్ 22 (జనవాణి): హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. సిద్ధిక్‌నగర్‌లోని ఓ ఓయో హోటల్‌లో మహిళ తీవ్రగాయాలతో మృతిచెందడం కలకలం రేపింది. ప్రియురాలిపై దాడి చేసి ఆమె మృతికి కారణమైనట్లు అనుమానిస్తున్న యువకుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన శ్రీనివాస రవితేజ, ఓ మహిళ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చారు. అనంతరం మాదాపూర్ సిద్ధిక్‌నగర్‌లోని ఓ ఓయో హోటల్‌లో గది తీసుకున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి మాదాపూర్ పోలీసులకు మహిళ మృతిపై సమాచారం అందింది.
వెంటనే పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. మహిళకు తీవ్రగాయాలు కావడంతో శ్రీనివాస రవితేజ, ఓయో హోటల్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు తెలిసింది. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మహిళ మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే శ్రీనివాస రవితేజ అక్కడి నుంచి కనిపించకుండా పోయినట్లు పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు మహిళ ముఖం, తలపై తీవ్ర గాయాలు, వాపు కనిపించాయి. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఓయో హోటల్‌కు చేరుకుని గదిని పరిశీలించారు. గదిలోని గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు గుర్తించారు.
వెంటనే క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి ఆధారాలను సేకరించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న శ్రీనివాస రవితేజ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.




















