పరీక్షలో ChatGPT వాడుతూ దొరికిన విద్యార్థి..IIT Bombay లో స్టూడెంట్ ఆత్మహత్య

ముంబైలోని పవాయ్‌లో ఉన్న ఐఐటీ బాంబే క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల సాహిల్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల జరిగిన పరీక్షలో మొబైల్ ఫోన్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని ChatGPTలో అప్‌లోడ్ చేసి సమాధానాలు వెతికినట్లు ఆరోపణలు రావడం, అనంతరం క్యాంపస్‌లో ఈ విషయంపై ప్రచారం జరగడంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.

19 సెప్టెంబర్, 2026 12:40 PM•ByNarender Kumar Nangunoori

Share this article

పరీక్షలో ChatGPT వాడుతూ దొరికిన విద్యార్థి..IIT Bombay లో స్టూడెంట్ ఆత్మహత్య

ముంబై, సెప్టెంబర్ 19 (జనవాణి): ఐఐటీ బాంబేలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 19 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి సాహిల్ శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పవాయ్‌లోని ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం ఇటీవల జరిగిన ఓ పరీక్షలో సాహిల్ మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు గుర్తించారు. పరీక్షలోని ప్రశ్నాపత్రాన్ని ChatGPTలో అప్‌లోడ్ చేసి సమాధానాలు వెతుకుతుండగా పట్టుబడినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో ఇన్‌స్టిట్యూట్ అధికారులు అతడిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

సాహిల్‌ను డిపార్ట్‌మెంట్ హెడ్ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అతడి అకడమిక్ కెరీర్‌పై ప్రభావం చూపదని భరోసా ఇచ్చినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించి పంపించినట్లు తెలుస్తోంది.

అయితే ఆ తర్వాత పరీక్షలో మొబైల్ ఉపయోగించాడన్న విషయం క్యాంపస్‌లో ప్రచారం కావడంతో సాహిల్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం ఐఐటీ బాంబేలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న మరణాలపై యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు క్యాంపస్‌లో భద్రతను పెంచారు.

మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులతో ఐఐటీ బాంబే యాజమాన్యం చర్చలు జరిపింది. మృతిచెందిన విద్యార్థికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సాహిల్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఐఐటీ బాంబే క్యాంపస్‌లో చోటుచేసుకున్న నాలుగో మరణం ఇదేనని సమాచారం.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు