మహారాష్ట్ర, ఆగస్టు 24 (జనవాణి): మహారాష్ట్రలో మరో వైద్యుడిపై దాడి జరగడం కలకలం రేపుతోంది. థానేలోని కల్యాణ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ యోగేంద్ర జైస్వాల్‌పై రోగి కుమారుడు దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శనివారం రాత్రి డాక్టర్ యోగేంద్ర జైస్వాల్.. దేశ్‌ముఖ్ అనే రోగిని పరీక్షిస్తున్నారు. రోగికి పక్కటెముకకు గాయం కావడంతో చికిత్స విధానం, బ్యాండేజ్ వేయాల్సిన పద్ధతి, మందులు ఎలా వాడాలనే విషయాలను వైద్యుడు వివరిస్తున్నారు. ఈ సమయంలో రోగి కుమారుడు ఒకే ప్రశ్నను పదేపదే అడగడంతో వైద్యుడు, అతడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం కాస్తా తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన రోగి కుమారుడు వైద్యుడిపై దాడికి పాల్పడ్డాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ డాక్టర్‌ను విచక్షణారహితంగా కొట్టాడు. అక్కడే ఉన్న వారు ఘటనను వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వరుసగా వైద్యులపై దాడులు జరుగుతుండటంతో మహారాష్ట్రలో వైద్యుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, గత నెలలో కల్యాణ్-డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శాస్త్రి నగర్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై శివసేన కార్పొరేటర్ రమేష్ మాత్రే దాడి చేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. గర్భిణిని మరో ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించడంపై ఆగ్రహించిన కార్పొరేటర్ తన అనుచరులతో కలిసి ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో విధుల్లో ఉన్న మహిళా డాక్టర్‌తో పాటు మరో వైద్యాధికారిపై దాడి జరిగినట్లు సమాచారం. తాజాగా మరో వైద్యుడిపై దాడి జరగడంతో ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.




















