పుణె,అక్టోబర్ 1 (జనవాణి): మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పుణె నుంచి పిక్నిక్‌కు వెళ్లిన విద్యార్థుల్లో 8 మంది సముద్రంలో మునిగి మృతి చెందారు. రాయ్‌గఢ్ జిల్లాలోని దివేగార్ బీచ్‌లో ఈ ఘటన జరిగింది. విద్యార్థుల మృతితో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
48 మందితో పిక్నిక్..
పుణెలోని అలందీకి చెందిన ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌కు చెందిన 48 మందితో కూడిన బృందం దివేగార్ బీచ్‌కు విహారయాత్రకు వెళ్లింది. ఈ బృందంలో 25 మంది బాలురు, 17 మంది బాలికలు, ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. అక్కడ కొందరు విద్యార్థులు సరదాగా సముద్రంలో ఈతకు దిగారు. అయితే సముద్రంలోకి వెళ్లిన వారిలో 8 మంది తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు గల్లంతైన 8 మంది విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు.
లోతు, ప్రవాహాన్ని అంచనా వేయలేకపోవడమే కారణమా?
విద్యార్థులు సముద్రం లోతు, నీటి ప్రవాహాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శవ పంచనామా, పోస్టుమార్టం ప్రక్రియ అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, విద్యార్థుల సముద్ర ప్రవేశం తదితర అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Loading Tweet...




















