ఢిల్లీ, సెప్టెంబర్ 01 (జనవాణి); జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలకు సంబంధించి విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 20 నుంచి 25 మధ్య వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన కేసులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే క్రిమినల్ చరిత్ర ఉన్న 2,873 మందికి సంబంధించి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలపై నమోదైన ఒక ఎఫ్‌ఐఆర్‌ను కొనసాగించేందుకు కోర్టు అనుమతించింది. జూలై 25న ఇచ్చిన హామీ మేరకు బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం తరఫున ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ల రద్దు కోసం దరఖాస్తులు దాఖలు చేసినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇరువర్గాలు విశ్వాసంతో చర్చించుకుంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చని వ్యాఖ్యానించింది. దీనిపై తుషార్ మెహతా స్పందిస్తూ.. తాము శత్రువులం కాదని, సానుకూల దృక్పథంతో సమస్యను పరిష్కరించామని తెలిపారు. మరోవైపు, NEET-UG 2026 పరీక్ష రద్దు కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పరిహారం అందించే నిబంధనలు రూపొందించేందుకు మూడు నెలల సమయం కావాలని సొలిసిటర్ జనరల్ కోరగా, సుప్రీంకోర్టు ఆ గడువును అంగీకరించింది.
తమ డిమాండ్లపై కేంద్రం నుంచి తగిన చర్యలు లేవని భావించిన సీజేపీ సెప్టెంబర్ 5న ఢిల్లీలో భారీ మార్చ్‌కు పిలుపునిచ్చింది. అయితే సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ హామీల నేపథ్యంలో ఆ నిరసన కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.




















