20 ఏళ్ల వైవాహిక బంధం..క్రిస్టియన్ పద్ధతిలో సూర్య-జ్యోతిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నటి జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. 2006లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న ఈ జంట.. రెండు దశాబ్దాల తర్వాత చర్చిలో క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన జ్యోతిక.. తమ 20 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగపూరితమైన సుదీర్ఘ పోస్ట్ చేశారు.

16 సెప్టెంబర్, 2026 4:21 PM•ByNarender Kumar Nangunoori

Share this article

20 ఏళ్ల వైవాహిక బంధం..క్రిస్టియన్ పద్ధతిలో సూర్య-జ్యోతిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక మరోసారి తమ ప్రేమకు, వైవాహిక బంధానికి గుర్తుగా పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. వివాహం జరిగి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చర్చిలో క్రైస్తవ సంప్రదాయంలో ప్రత్యేక వేడుక నిర్వహించుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ది సీక్వెల్’ అంటూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.

20 ఏళ్ల బంధానికి గుర్తుగా..

2006 సెప్టెంబర్ 11న హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటైన సూర్య, జ్యోతిక.. రెండు దశాబ్దాల తర్వాత తమ పెళ్లి ప్రమాణాలను మరోసారి పునరుద్ధరించుకున్నారు. ఇది పరిపూర్ణమైన వివాహాన్ని సెలబ్రేట్ చేసుకునే వేడుక కాదని, తమ జీవితంలోని అసంపూర్ణతలు, సర్దుబాట్లు, అవగాహన, త్యాగాలు, నిస్వార్థమైన ప్రేమకు గుర్తుగా ఈ వేడుకను నిర్వహించుకున్నామని జ్యోతిక పేర్కొన్నారు.

‘ఎప్పుడూ సంతోషంగా ఉంటానని ప్రమాణం’

తాను ఎప్పుడూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని, జీవితంలోని పాజిటివిటీని మాత్రమే చూడాలని కోరుకుంటానని జ్యోతిక తెలిపారు. జీవితాన్ని ఓ వేడుకలా జరుపుకుంటానని, తనను ప్రేమించే వ్యక్తి తనకంటే ఎక్కువగా గౌరవించడం గొప్ప బహుమతని పేర్కొన్నారు. జీవితంలో ఫిర్యాదులకు చోటివ్వకుండా ఉండాలని, ఈ ప్రపంచంలో ప్రతిదీ అసంపూర్ణమేనని జ్యోతిక తన పోస్టులో రాసుకొచ్చారు. తనను ఎప్పుడూ రక్షించే వ్యక్తి చేతుల్లో ప్రతి ఉదయం మేల్కొంటున్నానని, తన జీవితానికి అర్థాన్ని ఇచ్చే అందమైన పిల్లలు తనకు ఉన్నారని చెప్పుకొచ్చారు.

‘ఆరోగ్యమే నిజమైన ఆస్తి’

ఆరోగ్యంగా ఉంటానని, అదే నిజమైన ఆస్తి అని జ్యోతిక పేర్కొన్నారు. ఉత్తమమైన తల్లిగా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. సూర్యతో గొడవపడటం, మళ్లీ రాజీపడటం.. ఇలా ప్రతిసారీ మరింత దగ్గరవుతూ ఉండే అసంపూర్ణమైన భార్యగా కొనసాగుతానని భావోద్వేగంగా తెలిపారు. అన్నింటికంటే తమ స్నేహాన్ని పదిలంగా కాపాడుకుంటానని జ్యోతిక చెప్పారు. తన రహస్యాలను పంచుకునే వ్యక్తి, తన కబుర్లకు భాగస్వామి, తన ప్రాణ స్నేహితుడు సూర్యనేనని పేర్కొన్నారు. రాబోయే 20 ఏళ్లకు శుభాకాంక్షలు అంటూ తన పోస్టును ముగించారు.

క్రైస్తవ సంప్రదాయంలో వేడుకలపై చర్చ

సూర్య, జ్యోతిక చర్చిలో క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించుకోవడంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. వీరిద్దరి మతపరమైన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన తమ వ్యక్తిగత కారణాలను సూర్య, జ్యోతిక అధికారికంగా వివరించలేదు.

కుటుంబంతో కలిసి సెలబ్రేషన్స్

సూర్య-జ్యోతిక దంపతులకు దియా, దేవ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరితో పాటు సూర్య సోదరుడు, నటుడు కార్తీ కూడా ఈ ప్రత్యేక వేడుకల్లో పాల్గొనడం విశేషం. 20 ఏళ్ల వైవాహిక ప్రయాణాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేకంగా జరుపుకున్న ఈ జంటకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు