నాగర్‌కోయిల్,సెప్టెంబర్ 26 (జనవాణి): సోషల్ మీడియాలో ఏం పోస్టు చేస్తున్నామనే విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. ఇంట్లోని డబ్బు, బంగారు ఆభరణాలను వీడియోల్లో చూపించిన ఓ యూట్యూబర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు ఆమె సోషల్ మీడియా పోస్టులను పరిశీలించి చోరీకి పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని తమత్తుకోణం ప్రాంతంలో వ్యాపారి వినోద్‌కుమార్, ఆయన భార్య మధుమిత పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. మధుమిత యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో క్రమం తప్పకుండా వీడియోలు చేస్తుంటారు. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి వెనుక తలుపు తెరిచి కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన వారు లోపలికి వెళ్లి చూడగా ఓ గదిలోని బీరువా పగలగొట్టి ఉంది. అందులో భద్రపరిచిన బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, నగదు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దర్యాప్తులో భాగంగా మధుమిత సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. గతంలో ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదును వీడియోల్లో చూపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పరుపుపై పెద్ద మొత్తంలో నోట్ల కట్టలను ప్రదర్శిస్తూ, ఇంట్లోని బంగారు ఆభరణాలను కూడా వీడియోల్లో చూపించారు.
మరోవైపు కుటుంబ సభ్యులు బయటకు వెళ్లినప్పుడు తాము ఎక్కడికి వెళ్తున్నామనే విషయాన్ని కూడా సోషల్ మీడియాలో వెల్లడించేవారని పోలీసులు గుర్తించారు. ఈ సమాచారాన్ని దొంగలు ఉపయోగించుకున్నారా? సోషల్ మీడియా పోస్టుల ఆధారంగానే ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గుర్తించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన బంగారం, వజ్రాభరణాలు, నగదు విలువ రూ.కోటికి పైగా ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Loading Tweet...




















