హైదరాబాద్, ఆగస్టు 7 (జనవాణి): జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చేనేత కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఆయన, చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి చేనేత వెన్నెముక అని పేర్కొన్న కేటీఆర్, జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్న వేళ రాష్ట్రంలోని నేతన్నల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేనేత రంగానికి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. సుమారు 55 వేల మంది చేనేత కార్మికులకు రూ.5 లక్షల నేతన్న బీమా కల్పించడంతో పాటు, ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించిందన్నారు. 'నేతన్నకు చేయూత' పథకం ద్వారా కార్మికుల పొదుపును ప్రోత్సహిస్తూ ప్రభుత్వ వాటా జమ చేశామని తెలిపారు. బతుకమ్మ చీరలు, ప్రభుత్వ పాఠశాల యూనిఫారాల తయారీ బాధ్యతలను చేనేత రంగానికే అప్పగించి వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించామని గుర్తు చేశారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన నేతన్న బీమా, నేతన్నకు చేయూత వంటి పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. పావలా వడ్డీ రుణాలు, మార్కెటింగ్ రిబేట్లను కూడా నిలిపివేసిందన్నారు. బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫారాల వంటి ప్రభుత్వ ఆర్డర్లలో చేనేతకు ఇచ్చిన ప్రాధాన్యతను తగ్గించి నేతన్నలను ఇబ్బందుల్లోకి నెట్టిందని విమర్శించారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన చేనేత భరోసా, వ్యక్తిగత రుణమాఫీ, సహకార సంఘాల రుణమాఫీ, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ వంటి హామీలను రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. చేనేత భరోసా కింద ఏడాదికి రూ.18 వేల సాయం, అనుబంధ కార్మికులకు రూ.6 వేల సాయం, లక్ష రూపాయల వరకు రుణమాఫీ వంటి హామీల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా చేనేత రంగానికి అనుకూలంగా వ్యవహరించడం లేదని కేటీఆర్ విమర్శించారు. ఆల్ ఇండియా హ్యాండ్‌లూమ్ బోర్డు, హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, పవర్‌లూమ్ బోర్డులను రద్దు చేయడం, చేనేతపై 5 శాతం జీఎస్‌టీ విధించడం వంటి నిర్ణయాలతో రంగాన్ని దెబ్బతీసిందన్నారు.
చేనేత కళాకారుల కోసం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని, గతంలో నిలిపివేసిన అన్ని పథకాలను పునరుద్ధరించాలని, ముఖ్యంగా నేతన్న బీమా, నేతన్నకు చేయూత పథకాలను తిరిగి అమలు చేసి బకాయిలు విడుదల చేయాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన చేనేత భరోసా, రుణమాఫీ, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.





















