ఇంజనీరింగ్ విద్యార్థులను, ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీకి బహిరంగ లేఖ రాశారు.
ఒకవైపు భారతదేశ ఇంజనీర్లు ప్రపంచ కంపెనీలను నడుపుతుంటే, అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే... అలాంటి వారిని "క్రిమినల్ వేస్ట్" అని రేవంత్ రెడ్డి అంటున్నాడని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. దేశ ప్రగతికి పాటుపడుతూ లక్షల మందికి ఉద్యోగ ఉపాధిని అందిస్తున్న ఇంజనీర్లను రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ ఈ అంశంలో మౌనంగా ఉండటం అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్లేనని స్పష్టం చేశారు.
యువత రేపటి భారతదేశ నిర్మాతలు అన్న విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు. గతంలో ఇదే కాంగ్రెస్ యువతతో పెట్టుకుంటే ఏమైందో రాహుల్ గాంధీ గుర్తుచేసుకోవాలన్నారు. యువత తలుచుకుంటే ఆ పార్టీ మెడలు ఎలా వంచుతారో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ యువత ఓట్లు అడిగి వారిని మభ్యపెట్టిన రాహుల్ గాంధీకి తన నైతిక బాధ్యతను గుర్తు చేయడానికే ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు.
రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, నైతికత... యువతకు దక్కాల్సిన గౌరవం వంటి అంశాలపై మాట్లాడే అర్హత కోల్పోయారని కేటీఆర్ విమర్శించారు. యువత గురించి రాహుల్ గాంధీ చెప్పే ఊకదంపుడు ప్రసంగాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి విద్యార్థులను, ఇంజనీర్లను, టీచర్లను క్రిమినల్ వేస్ట్ అంటున్నాడని మండిపడ్డారు. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని క్షమాపణ చెప్పాలని ఆదేశించకపోవడం, రేవంత్ రెడ్డి తరఫున రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకపోవడం... ఆ వ్యాఖ్యలను సమర్థించినట్లేనని స్పష్టం చేశారు. కేవలం ప్రసంగాలతో మాత్రమే నాయకత్వం స్థాయి పెరగదని రాహుల్ గాంధీ గుర్తించాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ విధానాలతోనే చేసిన తప్పులను సరిదిద్దుకోవడంతోనే పెరుగుతుందని గుర్తించి రాహుల్ గాంధీ స్పందించాలన్నారు.
తమ పార్టీ ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు విద్యార్థులకు, గురువులకు, ఇంజనీర్లకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని రాహుల్ గాంధీ చెప్పలేరని అన్నారు. తెలంగాణ యువత మీ ముఖ్యమంత్రి చేస్తున్న అడ్డమైన వ్యాఖ్యలను గమనిస్తోంది, గుర్తుంచుకుంటుందని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులనే కాకుండా ఇంజనీరింగ్ టీచర్లను కూడా తప్పుగా మాట్లాడారని అన్నారు.
యువతపై, విద్యార్థులపై అడ్డగోలుగా నోరు పారేసుకోవడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ యువత ఆత్మగౌరవం పైన, ఆత్మవిశ్వాసం పైన రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. దేశ ప్రగతి కోసం తమ జీవితాన్ని ధారపోస్తున్న అధ్యాపక గురువులను కూడా రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడారని అన్నారు. రేవంత్ రెడ్డి గతంలో ఇలాగే యూనివర్సిటీ విద్యార్థులను "బీరు బిర్యానీ బ్యాచ్" అన్నారని.. వారి రాజకీయ ఉద్యమాలను తక్కువ చేసి మాట్లాడారు. ఎవరు ప్రశ్నిస్తే వారిని తిట్టడం రేవంత్‌కి అలవాటు అయిందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వెంటనే విద్యార్థులకు, గురువులకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇంజనీర్లు, గురువులు క్రిమినల్ వేస్ట్ కాదు... యువతను అడుగడుగునా, నిలువునా మోసం చేసిన కాంగ్రెస్సే అసలైన క్రిమినల్ వేస్ట్ అని స్పష్టం చేశారు. ఇప్పటికే మీ హామీల పేరుతో మోసపోయిన యువత అన్ని గుర్తుంచుకుంటుంది.. సరైన సమయంలో తగిన సమాధానం చెబుతుందని గుర్తుంచుకోవాలన్నారు.





















