న్యూఢిల్లీ, ఆగస్టు 5: రామగుండం ప్రాంత ప్రజల సమస్యలు, స్థానిక యువతకు ఉద్యోగాలు, కార్మికుల సంక్షేమ అంశాలపై ఎన్టీపీసీ చైర్మన్, ఎండీ గురుదీప్ సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీ కలిశారు. రామగుండంలో చేపడుతున్న 800*3 మెగావాట్ల ఎన్టీపీసీ విస్తరణ ప్రాజెక్టులో స్థానికులకే ప్రాధాన్యమిచ్చి ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
రామగుండంలో భారీ ప్రాజెక్టులు అమలవుతున్నప్పటికీ స్థానిక యువతకు ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించడం లేదని ఎంపీ పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు ముందుగా స్థానిక ప్రజలకు అందేలా ఎన్టీపీసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రామగుండం ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్య సమస్యపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల విస్తరణతో ప్రభావితమవుతున్న ప్రజలకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా మాతంగి కాలనీల్లోని బాధిత కుటుంబాలకు పునరావాసం (ఆర్‌అండ్‌ఆర్)తో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
Loading Tweet...
కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను కూడా ఎంపీ వంశీకృష్ణ ప్రస్తావించారు. ప్రస్తుతం 'సి' గ్రేడ్‌లో ఉన్న కార్మికులను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ హోదాకు అనుగుణంగా 'బి' గ్రేడ్‌కు అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి మూడు నెలలకు నిర్వహిస్తున్న మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలను సంవత్సరానికి ఒకసారి నిర్వహించాలని, ఈఎస్‌ఐ సర్టిఫికేషన్ ఉన్నప్పటికీ మళ్లీ ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తీసుకురావాలని ఒత్తిడి చేయడాన్ని పునఃసమీక్షించాలని కోరారు.
తాను ప్రస్తావించిన అన్ని అంశాలను సానుకూలంగా పరిశీలిస్తామని ఎన్టీపీసీ ఛైర్మన్ గురుదీప్ సింగ్ హామీ ఇచ్చినట్లు ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. రామగుండం ప్రజల హక్కులు, స్థానిక యువత ఉపాధి, కార్మికుల సంక్షేమం కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.





















