తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత (Konda Susmitha) చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఉద్దేశించి సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. పరకాల నుంచి వచ్చే ఎన్నికల్లో తానే కాంగ్రెస్ అభ్యర్థినని సుస్మిత వ్యాఖ్యానించారు. రేవూరి ప్రకాశ్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా తన విజయాన్ని ఆపలేరని వ్యాఖ్యానించారు. రేవంత్ మాత్రమే కాదు.. ఆయన తాత వచ్చినా తానే గెలుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కౌంటర్ ఇస్తే సీఎం రేవంత్ సోదరుల వ్యవహారాలను బయటపెడతానని హెచ్చరించారు.
సుస్మిత వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కౌంటర్
సుస్మిత వ్యాఖ్యలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసే స్థాయి ఆమెకు లేదని మండిపడ్డారు. రేవంత్ కాలిగోటికికూడా ఆమె సరిపోదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేని వారు సీఎంపై మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. ‘పిల్ల కాకికి ఏం తెలుసు.. ఉండేలు దెబ్బ’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు మాట్లాడడానికి కనీస అర్హత కూడా లేదని.. డైపర్లు ఎవరు వేసుకుంటారో అందరికీ తెలుసన్నారు.
‘నా స్థాయిని తగ్గించుకోను’.. రేవూరి
మరోవైపు సుస్మిత వ్యాఖ్యలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆచితూచి స్పందించారు. వ్యక్తిగత విమర్శలకు సమాధానం చెప్పి తన స్థాయిని తగ్గించుకోనని స్పష్టం చేశారు. సరైన సమయంలో దీటుగా సమాధానం ఇస్తానన్నారు. ప్రజల్లో తనకు ఉన్న ఆదరణ, ఇంటెలిజెన్స్ నివేదికలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి తనను అభ్యర్థిగా ప్రకటించారని రేవూరి తెలిపారు. సరైన సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుని సమాధానం చెబుతుందని పేర్కొన్నారు.
ఈ పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పరకాల రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.




















