ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి ప్రోటీన్ ఎంతో అవసరం. కండరాల నిర్మాణం నుంచి కణాల మరమ్మతు వరకు అన్నింటిలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ప్రోటీన్ల కోసం ప్రోటీన్ కోసం చికెన్ తినాలా? లేక మటన్ తినాలా? ఈ సందేహం మనలో చాలామందికే ఉంటుంది. నిజానికి రెండింటిలోనూ ప్రోటీన్లు ఉంటాయి. కానీ ఆరోగ్యపరంగా అవి చూపించే ప్రభావం మాత్రం భిన్నంగా ఉంటుంది. అందుకే చికెన్, మటన్‌లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది? పరిశోధనలు, పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరానికి ప్రోటీన్ ఎందుకు అవసరం?
శరీరానికి అత్యంత కీలకమైన పోషకాల్లో ప్రోటీన్ ఒకటి. కండరాల పెరుగుదల, దెబ్బతిన్న కణజాలం పునర్నిర్మాణం, రోగనిరోధక శక్తి పెంపు, హార్మోన్లు, ఎంజైమ్‌ల తయారీలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వయస్సు, బరువు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులను బట్టి ప్రతి వ్యక్తికి అవసరమయ్యే ప్రోటీన్ పరిమాణం మారుతూ ఉంటుంది. అయితే ఈ ప్రోటీన్ కాయగూరలతో పాటు చికెన్, మటన్, చేపలు, గుడ్లు వంటి నాన్‌వెజ్‌లోనూ అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు అధికంగా దొరుకుతాయి. అయితే ఆరోగ్యపరంగా వాటిలో ఏవి మెరుగైనవనేది తెలుసుకోవడం చాలా అవసరం.
మటన్‌లో ప్రోటీన్ ఉన్నా.. కొవ్వు కూడా ఎక్కువే
మటన్‌లో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ, ఇందులో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. అందుకే దీనిని తరచుగా, ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 2024 అక్టోబర్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ప్రయోగాత్మకంగా మటన్ ఆహారం తీసుకున్న జంతువుల్లో కొన్ని ఆరోగ్య మార్పులను పరిశీలించారు. సాధారణ ఆహారం తీసుకున్న వాటితో పోలిస్తే మటన్ తీసుకున్న వాటిలో.. బరువు పెరగడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికమవ్వడం.. ట్రైగ్లిజరైడ్స్, ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) పెరగడం, హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) తగ్గడం, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వంటి మార్పులు కనిపించాయని అధ్యయనం పేర్కొంది. అయితే ఇవి జంతువులపై నిర్వహించిన పరిశోధన ఫలితాలు మాత్రమే. మనుషుల ఆరోగ్యానికి ఇవే ఫలితాలు వర్తిస్తాయని నేరుగా చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, మటన్‌ను పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
చికెన్ ఎందుకు ఆరోగ్యకరమైన ఎంపిక?
చికెన్‌ను సాధారణంగా లీన్ ప్రోటీన్‌గా పరిగణిస్తారు. ముఖ్యంగా చర్మం తొలగించిన చికెన్ బ్రెస్ట్‌లో కొవ్వు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో అధిక నాణ్యత గల ప్రోటీన్, తక్కువ సంతృప్త కొవ్వు, తక్కువ కొలెస్ట్రాల్, కండరాల పెరుగుదలకు అవసరమైన అమినో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. కార్బోహ్రైడేట్లు అసలే ఉండవు. కాబట్టి ఆరోగ్యానికి ఎక్కువ పోషకాలను అందిస్తాయి. అయితే చికెన్‌లోని భాగాన్ని బట్టి పోషక విలువలు మారుతాయి. బ్రెస్ట్ పీస్‌లో కొవ్వు తక్కువగా ఉండగా, తొడలు, రెక్కల్లో కొవ్వు కొంత ఎక్కువగా ఉంటుంది. చర్మంతో తింటే క్యాలరీలు కూడా పెరుగుతాయి.
గుండె ఆరోగ్యానికి ఏది మంచిది?
గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారికి సాధారణంగా తక్కువ కొవ్వు ఉన్న ప్రోటీన్ ఆహారాలను వైద్యులు సూచిస్తారు. కాబట్టి మటన్‌తో పోలిస్తే స్కిన్‌లెస్ చికెన్‌ను తినడం మంచిదని అంటుంటారు. అలా అని మటన్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. అది కూడా పరిమిత మోతాదులో, తక్కువ నూనెతో వండుకుని తింటే ఆరోగ్యానికి పెద్ద నష్టమేమీ ఉండదని పోషహాకార నిపుణులు చెబుతున్నారు.
ప్రోటీన్ల కోసం చికెన్, మటనే అవసరం లేదు
మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందాలంటే చికెన్, మటన్ మాత్రమే తినాల్సిన అవసరం లేదు. గుడ్లు, చేపలు, పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, రాజ్మా, సోయా ఉత్పత్తులు, వేరు శనగలు, బాదంపప్పు వంటి ఆహారం తీసుకోవడం ద్వారా కూడా శరీరానికి కావాల్సిన సమతుల్య పోషకాలు లభిస్తాయి.
గమనిక: ఈ కథనం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీకు గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే, ఆహారంలో మార్పులు చేసేముందు వైద్యులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.





















