ఢిల్లీలో ఉద్రిక్తత..11 మెట్రో స్టేషన్లు మూసివేత

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

2 అక్టోబర్, 2026 2:53 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఢిల్లీలో ఉద్రిక్తత..11 మెట్రో స్టేషన్లు మూసివేత

ఢిల్లీ, అక్టోబర్ 2 (జనవాణి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమిలోని పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), సామాజిక కార్యకర్తలు శుక్రవారం ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు.

జంతర్ మంతర్ నుంచి సెంట్రల్ ఢిల్లీ వైపు వెళ్లే మార్గాల్లోని 11 ప్రధాన మెట్రో స్టేషన్లను డీఎంఆర్‌సీ తాత్కాలికంగా మూసివేసింది. సెంట్రల్ ఢిల్లీ పరిధిలో మొబైల్, ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. దీంతో ఉబర్, ఓలా, భారత్ ట్యాక్సీ, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్ ఆధారిత సేవలను వినియోగించడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరోవైపు న్యూఢిల్లీ జిల్లాలో బీఎన్‌ఎస్‌ఎస్‌లోని సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిశీతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని శివాజీ పార్క్ వద్ద శుక్రవారం నిరసన చేపట్టనున్నట్లు సీజేపీ ప్రకటించింది. ఆయన పదవి నుంచి వైదొలగకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని పార్టీ ప్రకటించింది. అక్టోబర్ నెలాఖరు నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపడతామని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే తెలిపారు.

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు దీప్కే వెల్లడించారు. ఈ ఉద్యమంలో తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సీజేపీ ఏ రాజకీయ పార్టీలోనూ భాగం కాదని, స్వతంత్ర ఉద్యమంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదే సమయంలో SIRకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. మరోవైపు అక్టోబర్ 6న ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఆందోళన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో SIR అంశంపై రాజకీయ పార్టీల నిరసనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు