హింసను వీడి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన మాజీ మహిళా మావోయిస్టుల జీవితాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన తొమ్మిది మంది మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం దక్కింది.
ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఈ మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర గ్రామోద్యోగ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్‌పై ఆత్మవిశ్వాసంతో నడిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో బాలీవుడ్ దర్శకుడు ఆకాశ్ ఆదిత్య లామా దృష్టిని ఆకర్షించినట్లు సమాచారం. ‘బెంగాల్ 1947’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన.. తన తదుపరి సినిమాలో ఈ తొమ్మిది మందికి అవకాశం కల్పించేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

1994లో బస్తర్‌లో జరిగిన ఘటన ఆధారంగా సినిమా
1994లో బస్తర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మావోయిజం ప్రభావిత ప్రాంతాల్లో జీవించిన అనుభవం ఉన్నందున.. సినిమాలోని పాత్రలకు వీరి సహజమైన నటన మరింత వాస్తవికతను తీసుకొస్తుందని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా చిత్రీకరణను నవంబర్, డిసెంబర్ నెలల్లో బస్తర్ అడవుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నటించే అవకాశం దక్కిన తొమ్మిది మందికి ముందుగా ఆడిషన్లు నిర్వహించనున్నారు. ఎంపికైన అనంతరం సుమారు 10 నుంచి 15 రోజుల పాటు నటనలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
పునరావాసానికి ఊతం: సీఎం విష్ణుదేవ్ సాయ్
మాజీ మహిళా మావోయిస్టులకు సినీ రంగంలో అవకాశం లభించడంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ హర్షం వ్యక్తం చేశారు. హింసను వీడి సాధారణ జీవితంలోకి వచ్చిన వారికి ఇలాంటి అవకాశాలు లభించడం పునరావాస ప్రక్రియకు మరింత ఊతమిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు ఇలాంటి అవకాశాలు దోహదపడతాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు అడవుల్లో తుపాకులు పట్టిన చేతులు.. ఇప్పుడు అదే చేతులతో కెమెరా ముందు నటించేందుకు సిద్ధమవడం వారి జీవితాల్లో చోటుచేసుకున్న మార్పుకు ప్రతీకగా నిలుస్తోంది.




















