హైదరాబాద్‌ NIA కోర్టు సంచలన తీర్పు..ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి నెట్టిన నిందితులకు జీవిత ఖైదు

హైదరాబాద్‌లోని ప్రత్యేక NIA కోర్టు 2019 నాటి అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను ఉద్యోగాల పేరుతో భారత్‌కు అక్రమంగా తరలించి, వ్యభిచారంలోకి నెట్టిన కేసులో ఎనిమిది మంది బంగ్లాదేశీయులు సహా తొమ్మిది మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది.

18 సెప్టెంబర్, 2026 12:50 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హైదరాబాద్‌ NIA కోర్టు సంచలన తీర్పు..ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి నెట్టిన నిందితులకు జీవిత ఖైదు

హైదరాబాద్,సెప్టెంబర్ 18 (జనవాణి): 2019 నాటి మానవ అక్రమ రవాణా కేసులో ప్రత్యేక NIA కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్‌ నుంచి మహిళలను అక్రమంగా భారత్‌కు తరలించి, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి వ్యభిచారంలోకి నెట్టిన కేసులో తొమ్మిది మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. వీరిలో ఎనిమిది మంది బంగ్లాదేశ్‌ జాతీయులు కాగా ఒకరు భారతీయుడు.

2019లో వెలుగులోకి వచ్చిన కేసు

2019 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో జల్‌పల్లి గ్రామంలోని ఓ వ్యభిచార గృహం నుంచి ముగ్గురు బంగ్లాదేశ్‌ మహిళలను, బాలాపూర్‌లోని మహ్మూద్‌ కాలనీలోని ఓ ఇంటి నుంచి మరో మహిళను రక్షించారు. దీంతో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా మహిళలను బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు అక్రమంగా తరలించినట్లు తేలింది. మంచి జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి భారత్‌కు తీసుకొచ్చిన అనంతరం వారిని వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది.

NIA చేతికి దర్యాప్తు

తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసును NIA స్వీకరించి 2019 అక్టోబర్‌లో RC-03/2019/NIA/HYDగా రీ-రిజిస్టర్‌ చేసింది. అనంతరం పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ తదితర ప్రాంతాల్లో నిందితుల కోసం దర్యాప్తు చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది. 2020 అక్టోబర్‌ 17న నిందితులపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

తొమ్మిది మందికి జీవిత ఖైదు

దాదాపు ఏడేళ్ల తర్వాత.. సెప్టెంబర్‌ 17, 2026న ప్రత్యేక NIA కోర్టు తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. అలాగే దోషులపై కలిపి రూ.1,37,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

దోషుల వివరాలు

రుహుల్‌ అమిన్‌ ధాలి

మొహ్మద్‌ యూసుఫ్‌ ఖాన్‌ అలియాస్‌ ఎండీ ఇమ్రాన్‌

బీథీ బేగం అలియాస్‌ ఖదీజా షేక్‌

ఇమాముల్‌ ఘాజీ అలియాస్‌ మొహ్మద్‌ రాణా హుస్సేన్‌

మొహమ్మద్‌ అల్‌ మామున్‌

సోజిబ్‌ షేక్‌

సురేష్‌ కుమార్‌ దాస్‌ అలియాస్‌ సాగర్‌

మొహ్మద్‌ అబ్దుల్లా మున్షి అలియాస్‌ అబ్దుల్‌ సర్కార్‌

మొహ్మద్‌ అయూబ్‌ షేక్‌

వీరిపై భారతీయ శిక్షాస్మృతి (IPC), ఫారినర్స్‌ యాక్ట్‌, 1946, ఇమ్మోరల్‌ ట్రాఫిక్‌ (ప్రివెన్షన్‌) యాక్ట్‌, 1956లోని వివిధ నిబంధనల కింద కేసు నడిచింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు