అధికారి ముందు కుక్క పిల్లలతో నిరసన.. షాకైన ప్రభుత్వ అధికారి!

మహారాష్ట్రలోని నిఫాడ్ నగర పంచాయత్ కార్యాలయంలో వినూత్న నిరసన చోటుచేసుకుంది. వీధి కుక్కల బెడదపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ శివసేన (యూబీటీ) యువసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కుక్క పిల్లలను సంచుల్లో తీసుకెళ్లి ఏకంగా పంచాయత్ ప్రధాన అధికారి టేబుల్‌పై వదిలారు. అంతేకాకుండా కరెన్సీ నోట్ల దండతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించడంతో కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది.

17 సెప్టెంబర్, 2026 4:35 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అధికారి ముందు కుక్క పిల్లలతో నిరసన.. షాకైన ప్రభుత్వ అధికారి!

నాసిక్,సెప్టెంబర్ 17 (జనవాణి): ప్రభుత్వ కార్యాలయం.. ముందు కొందరు నాయకులు.. ప్రజా సమస్యలపై అధికారికి ఫిర్యాదు. సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి సడెన్‌గా లేచి సంచిలో నుంచి కుక్క పిల్లను బయటకు తీశాడు. దాన్ని అధికారి టేబుల్‌పై వదిలాడు. ఊహించని ఘటనతో అధికారి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అంతలోనే మరో కుక్క పిల్లను కూడా టేబుల్‌పై పెట్టడంతో ఆయన తన కుర్చీలోంచి వెనక్కి జరిగాడు. మహారాష్ట్రలోని నిఫాడ్ నగర పంచాయత్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వీధి కుక్కల బెడదపై నిరసన

శివసేన (యూబీటీ) యువసేన నాసిక్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రాంధవే నేతృత్వంలోని బృందం నిఫాడ్ నగర పంచాయత్ ప్రధాన అధికారి ధీరజ్ భమ్రేను కలిసింది. నిఫాడ్ పరిధిలో వీధి కుక్కల బెడద పెరిగిపోయిందని, ప్రజలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని వారు అధికారికి వివరించారు. గత ఆరు నెలలుగా ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని రాంధవే ఆరోపించారు. తాజాగా ఓ చిన్నారిపై కూడా వీధి కుక్కలు దాడి చేశాయని తెలిపారు. కుక్కల సమస్య తీవ్రతను తెలియజేసేందుకు ఫొటోలు కూడా అధికారులకు పంపినట్లు పేర్కొన్నారు.

సంచుల్లో కుక్క పిల్లలు.. అధికారికి షాక్

అధికారులు స్పందించడం లేదంటూ ఆగ్రహించిన యువసేన కార్యకర్తలు తమ వెంట తీసుకెళ్లిన సంచుల్లోని కుక్క పిల్లలను ఒక్కొక్కటిగా బయటకు తీశారు. వాటిని ప్రధాన అధికారి టేబుల్‌పై వదిలారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అంతటితో ఆగకుండా కరెన్సీ నోట్లతో తయారు చేసిన దండను ధీరజ్ భమ్రే మెడలో వేసేందుకు విక్రమ్ రాంధవే ప్రయత్నించారు. అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది వెంటనే ఆయనను అడ్డుకున్నారు. దీంతో అధికారులు, యువసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కార్యకర్తలను కార్యాలయం నుంచి బయటకు పంపించారు.

‘వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలి’

ధీరజ్ భమ్రే టెండర్ పనులపైనే దృష్టి పెట్టారని, ప్రజలు ఎదుర్కొంటున్న వీధి కుక్కల సమస్యను పట్టించుకోవడం లేదని రాంధవే ఆరోపించారు. అందుకే నిరసనలో భాగంగా కుక్క పిల్లలను కార్యాలయానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వారం రోజుల్లోగా వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని, లేదంటే మరోసారి మరిన్ని కుక్కలను కార్యాలయంలోకి తీసుకొస్తామని రాంధవే హెచ్చరించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు