‘యువతరానికి బాధ్యతలు అప్పగించాలి’.. నితిన్ గడ్కరీ కామెంట్స్‌పై తీవ్ర చర్చ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. గతంలో మాదిరిగా తాను పని చేయలేకపోతున్నానని, బాధ్యతలను యువతరానికి అప్పగించాలని ఆయన చేసిన వ్యాఖ్యలతో యాక్టివ్ పాలిటిక్స్‌కు గడ్కరీ దూరం కానున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశంతో చేసినవి కావని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది.

25 ఆగస్టు, 2026 8:51 PM•ByNarender Kumar Nangunoori

Share this article

‘యువతరానికి బాధ్యతలు అప్పగించాలి’.. నితిన్ గడ్కరీ కామెంట్స్‌పై తీవ్ర చర్చ

నాగ్‌పూర్‌: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గడ్కరీ.. గతంలో మాదిరిగా తాను ఇప్పుడు పని చేయలేకపోతున్నానని, బాధ్యతలను యువతరానికి అప్పగించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. గత 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో నిరంతరం పనిచేస్తున్నానని చెప్పిన గడ్కరీ.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, అనేక అవార్డులు అందుకున్నానని తెలిపారు. ప్రస్తుతం సామాజిక సేవలో తన భాగస్వామ్యం తగ్గిందని, “పనులను కొత్త తరానికి అప్పగించాలి. కొత్త తరం వచ్చింది. పాత తరం వారికి మార్గనిర్దేశం చేస్తోంది” అని గడ్కరీ వ్యాఖ్యానించారు. అయితే అభివృద్ధి పనులు ఇంకా చాలా చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఏ ఒక్క గిరిజన గ్రామం కూడా విద్యుత్ సౌకర్యం లేకుండా ఉండకూడదని, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధిపై దృష్టి కొనసాగుతుందని తెలిపారు.

గడ్కరీ రాజకీయాలకు గుడ్‌బై చెబుతారా?

గడ్కరీ వ్యాఖ్యలతో ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరం కానున్నారా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ప్రధాని మోదీ కేబినెట్‌లో మార్పులు ఉండొచ్చన్న ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు రావడం మరింత ఆసక్తిని పెంచింది. అయితే ఈ ఊహాగానాలకు గడ్కరీ కార్యాలయం తెరదించింది. గడ్కరీ వ్యాఖ్యలు రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి కాదని స్పష్టం చేసింది.

అసలు సందర్భం ఏంటంటే..

గడ్కరీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా లక్ష్మణరావు మంకర్ ట్రస్ట్ గురించి ప్రస్తావించారని ఆయన కార్యాలయం తెలిపింది. గడ్కరీ స్వయంగా స్థాపించిన ఈ సంస్థ గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు ‘ఏకల్ విద్యాలయాల’ నిర్వహణలో కీలకంగా పనిచేస్తోంది. ఈ ట్రస్ట్ భవిష్యత్ నాయకత్వం, బాధ్యతల బదలాయింపు అంశాలపై మాట్లాడుతున్న సందర్భంలోనే గడ్కరీ ఆ వ్యాఖ్యలు చేశారని ఆయన కార్యాలయం వెల్లడించింది. కొన్ని టీవీ ఛానళ్లు ఆయన వ్యాఖ్యలను అసలు సందర్భం నుంచి విడదీసి రాజకీయ ప్రకటనగా చిత్రీకరిస్తున్నాయని పేర్కొంది.

బీజేపీలో జనరేషనల్ షిఫ్ట్‌పై చర్చ

మరోవైపు బీజేపీలో సంస్థాగతంగా కొత్త తరం నాయకత్వానికి ప్రాధాన్యం పెరుగుతున్న సమయంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించగా.. మొత్తం 65 మందిలో 51 మంది కొత్తవారికి చోటు దక్కింది. ఇది పార్టీలో పెద్ద ఎత్తున జనరేషనల్ షిఫ్ట్‌కు సంకేతమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గడ్కరీ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయవచ్చనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ఇటీవల బీజేపీలో చోటుచేసుకున్న సంస్థాగత మార్పులతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఈ సమయంలో నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆయన కార్యాలయం ఇచ్చిన వివరణతో గడ్కరీ రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారన్న ప్రచారానికి ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లైంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు