బెంగళూరు, ఆగస్టు 12 (జనవాణి): బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడంపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. తన ఓటు హక్కును తొలగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా ఎన్నికల సంఘం దీనిపై క్లారిటీ ఇచ్చింది.
కర్ణాటకలో ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ప్రకాశ్ రాజ్ ఓటు వివరాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఆయన ఓటరు నమోదైన చిరునామాలో నాలుగేళ్లుగా నివసించడం లేదని సర్వేలో తేలిందని పేర్కొన్నారు. దీంతో ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయన పేరును ‘షిఫ్టెడ్’ కేటగిరీలోకి మార్చినట్లు బెంగళూరు అదనపు జిల్లా ఎన్నికల అధికారి, సెంట్రల్ సిటీ కార్పొరేషన్ కమిషనర్ జగదీష్ జి వెల్లడించారు.
ప్రకాశ్ రాజ్ ఏమన్నారు?
SIR ప్రక్రియలో లక్షలాది మంది అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. తాను పుట్టి, పెరిగి, చదువుకుని, నాటకాలు వేసిన శాంతినగర్ (బెంగళూరు సెంట్రల్) నియోజకవర్గంలోనే తన ఓటు హక్కును తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి తాను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని అటువంటి నా ఓటునే తొలగించడం నిజంగా ఒక పెద్ద జోక్. తమకు ఓటు వేయరన్న ఉద్దేశంతోనే అధికారంలో ఉన్నవారు కొందరి ఓటింగ్ హక్కులను నిరాకరించవచ్చు, కానీ మిమ్మల్ని అధికారం నుంచి దించే ప్రజాస్వామ్య శక్తిని ఆపగలరా? అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కును తిరిగి పొందేందుకు అవసరమైన ఆధారాలను సమర్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఓటు తిరిగి పొందొచ్చు: ఈసీ
ప్రకాశ్ రాజ్ ఆరోపణలపై స్పందించిన అధికారులు.. ఆయన పేరు శాశ్వతంగా తొలగించలేదని స్పష్టం చేశారు. పాత చిరునామాలో నివసించడం లేదని నిర్ధారణ కావడంతో ‘షిఫ్టెడ్’ కేటగిరీలోకి మార్చినట్లు తెలిపారు. ప్రస్తుతం శాంతినగర్‌లో నివసిస్తున్న చిరునామా ఆధారంగా ఫారమ్-6 సమర్పించి ఓటరు నమోదును తిరిగి పొందే అవకాశం ప్రకాశ్ రాజ్‌కు ఉందని అధికారులు వెల్లడించారు. అందువల్ల ఇది రాజకీయ కారణాలతో ఓటు హక్కును తొలగించిన వ్యవహారం కాదని.. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
Loading Tweet...




















