కరిచిన పామునే ఆస్పత్రికి తీసుకొచ్చాడు.. అది చూసి వైద్యులే షాక్!

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ యువకుడు పాము కాటుకు గురైన తర్వాత చేసిన పని ఆస్పత్రిలో కలకలం రేపింది. తనను కరిచిన పాము ఏ జాతికి చెందిందో వైద్యులకు తెలుస్తే సరైన చికిత్స అందుతుందని భావించిన అతడు ఆ పామును సజీవంగా పట్టుకుని బ్యాగులో పెట్టి ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బ్యాగులో నుంచి పామును బయటకు తీయడంతో వైద్యులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

19 సెప్టెంబర్, 2026 3:29 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కరిచిన పామునే ఆస్పత్రికి తీసుకొచ్చాడు.. అది చూసి వైద్యులే షాక్!

బరేలీ,సెప్టెంబర్ 19 (జనవాణి): ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. బిథ్రి చైన్‌పూర్ పరిధిలోని రామ్‌నగర్ గోటియా గ్రామానికి చెందిన అతుల్ (36) ఇంట్లోని మోటార్ కిందకు ఓ పాము చేరింది. దాన్ని తొలగించే ప్రయత్నంలో పాము అతడి చేతిపై కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని బరేలీ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే తనను కరిచిన పాము ఏదో వైద్యులకు తెలిస్తే చికిత్సకు ఉపయోగపడుతుందని భావించిన అతుల్ ఆ పామును పట్టుకుని ఓ బ్యాగులో పెట్టుకున్నాడు. అనంతరం అదే బ్యాగుతో ఆస్పత్రికి చేరుకున్నాడు.

బ్యాగులో నుంచి పాము బయటకు రావడంతో కలకలం

అతుల్ ఆస్పత్రికి చేరుకున్న తర్వాత బ్యాగులో ఉన్న పామును బయటకు తీయడంతో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సజీవంగా ఉన్న పామును ఆస్పత్రిలోకి తీసుకురావడంతో అక్కడ కొంతసేపు కలకలం నెలకొంది.

అయితే పరిస్థితిని అదుపులోకి తెచ్చిన వైద్యులు పామును అక్కడి నుంచి సురక్షితంగా తొలగించారు. అనంతరం అతుల్‌కు వెంటనే చికిత్స ప్రారంభించి యాంటీ-స్నేక్ వెనమ్ (ASV) అందించారు. ప్రస్తుతం అతుల్ పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

పామును ఆస్పత్రికి తీసుకురావొద్దు

పాముకాటుకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరుకోవడం అత్యంత కీలకమని వైద్యులు సూచిస్తున్నారు. పాము కరిచిన వెంటనే దాన్ని వెతకడం, చంపే వరకు వేచి ఉండటం లేదా కాటు వేసిన చోట స్థానిక చికిత్సలు చేయడం వల్ల చికిత్స ఆలస్యమై ప్రమాదం పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

అదేవిధంగా పాము ఏదో గుర్తించేందుకు సజీవంగా ఉన్న పామును ఆస్పత్రికి తీసుకురావడం చాలా ప్రమాదకరం అని వైద్యులు స్పష్టం చేశారు. పాము కనిపిస్తే దాని వద్దకు వెళ్లకుండా దూరంగా ఉండాలని సూచించారు. గుర్తింపు అవసరమైతే సురక్షితంగా తీసిన ఫొటో అందుబాటులో ఉంటే చూపించడం మంచిదని తెలిపారు.

వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి, జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. బరేలీ జిల్లాలో 24 గంటల వ్యవధిలో ఇది నాలుగో పాముకాటు కేసు అని వైద్యులు వెల్లడించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు