తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వీసా సేవలు, ఉన్నత విద్య, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యం, విద్యార్థుల భద్రత తదితర పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసా అపాయింట్‌మెంట్లు సకాలంలో లభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే వీసా ఇంటర్వ్యూ స్లాట్ల సంఖ్యను పెంచి, వీసా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణకు చెందిన నిపుణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా సీఎం రేవంత్ రెడ్డి రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా H-1B వీసా ప్రాసెసింగ్, రెన్యువల్, వీసా స్టాంపింగ్‌లో జాప్యం లేకుండా సరళతరం చేయాలని కోరారు. అలాగే వీసా నిబంధనల్లో వచ్చే మార్పులపై ముందుగానే సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అమెరికాలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల భద్రత, సంక్షేమంపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. విద్యార్థులకు అవసరమైన సహకారం అందేలా చర్యలు కొనసాగించాలని ముఖ్యమంత్రి కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణలో అమెరికా సంస్థలకు ఉన్న పెట్టుబడి అవకాశాలను సీఎం వివరించారు. ఐటీ, కృత్రిమ మేధ (AI), లైఫ్ సైన్సెస్, ఫార్మా, స్టార్టప్‌లు, పరిశోధన, ఆధునిక సాంకేతిక రంగాల్లో అమెరికా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని తెలిపారు. అలాగే అమెరికా విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యాసంస్థలతో కలిసి సంయుక్త పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించాలని సెర్జియో గోర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
సమావేశంలో అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న భారతీయ భాషల్లో తెలుగు ఒకటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు, రాష్ట్ర ప్రత్యేకతలపై రాయబారి సెర్జియో గోర్ చూపిన ఆసక్తిని ఆయన అభినందించారు.
తెలంగాణ-అమెరికా మధ్య వ్యాపారం, పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని అమెరికా రాయబారి సెర్జియో గోర్ హామీ ఇచ్చారు.




















