కొలంబియా: కొలంబియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది. 7.4 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన ప్రకంపనలతో పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. తాజా సమాచారం ప్రకారం కనీసం 132 మంది మృతి చెందగా.. 570 మంది గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు కొలంబియన్ అసోసియేషన్ ఆఫ్ క్యాపిటల్ సిటీస్ వివరాలు వెల్లడించింది. భూకంపం ధాటికి పశ్చిమ నగరమైన పెరీరాలోనే 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి సంఖ్య కూడా భారీగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు
కొలంబియన్ అసోసియేషన్ ఆఫ్ క్యాపిటల్ సిటీస్ అందించిన తాజా సమాచారం ప్రకారం... 7.4 తీవ్రత గల భూకంపం ప్రభావంతో పలు ప్రాంతాల్లో భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. గల్లంతైన తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం బంధువులు సహాయక చర్యలు కొనసాగుతున్న ప్రాంతాల్లో ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. భూకంపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ శిథిలాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
86 భవనాలు కూలిపోయాయి
భూకంపం ప్రభావంతో దేశవ్యాప్తంగా ఐదు క్యాపిటల్ సిటీస్‌ను రెడ్ అలర్ట్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 86 భవనాలు కూలిపోయినట్లు సమాచారం. ఏడు విమానాశ్రయాలు కార్యకలాపాలను నిలిపివేశాయి. కాలి నగరంలో 188 మంది గల్లంతైనట్లు మేయర్ తెలిపారు. మరోవైపు పెరీరాలో కేబుల్ కార్‌లో సుమారు ఆరు గంటల పాటు చిక్కుకుపోయిన 16 మందిని సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు.
జాతీయ అత్యవసర పరిస్థితి
భూకంపం నేపథ్యంలో కొలంబియా ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రాణాలను రక్షించడం, బాధితులకు తక్షణ సహాయం అందించడం తమ ప్రధాన ప్రాధాన్యత అని అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రిల్లా తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవసరమైన అన్ని వనరులను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.
107 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం
అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. కొలంబియా రాజధాని బొగోటాకు పశ్చిమాన సుమారు 400 కిలోమీటర్ల దూరంలోని చోకో ప్రాంతం శాన్ జోస్ డెల్ పాల్మార్ వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూమికి సుమారు 107 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రభావం పొరుగు దేశాలైన ఈక్వెడార్, పనామాకు కూడా తాకింది. అయితే అక్కడ స్వల్ప నష్టం మాత్రమే నమోదైనట్లు సమాచారం. రాజధాని బొగోటాతో పాటు పలు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భవనాలు తీవ్రంగా దెబ్బతినడంతో అనేక మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ప్రస్తుతం కొలంబియాలో సహాయక, పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.




















