ఇకపై 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా నో..!

Social Media | సోషల్‌ మీడియా ప్రభావాన్ని తగ్గించే దిశగా యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కీలక ప్రతిపాదన చేసింది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ గేమ్స్‌, చాట్‌బాట్‌లను వినియోగించకుండా నిషేధం విధించాలని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయెన్‌ ప్రతిపాదించారు.

17 సెప్టెంబర్, 2026 11:21 AM•ByPradeep

Share this article

ఇకపై 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా నో..!

ఇకపై 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా నో..!

Social Media | సోషల్‌ మీడియా ప్రభావాన్ని తగ్గించే దిశగా యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కీలక ప్రతిపాదన చేసింది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ గేమ్స్‌, చాట్‌బాట్‌లను వినియోగించకుండా నిషేధం విధించాలని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయెన్‌ ప్రతిపాదించారు. బుధవారం స్ట్రాస్‌బర్గ్‌లో జరిగిన వార్షిక ‘స్టేట్‌ ఆఫ్‌ ది యూరోపియన్‌ యూనియన్‌’ ప్రసంగంలో ఆమె ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. 13 ఏళ్లు దాటిన టీనేజర్లకూ మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని సూచించారు. బడా టెక్‌ కంపెనీల ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, దాన్ని నియంత్రించడం సాధ్యం కాదని చాలామంది భావిస్తున్నారని లేయెన్‌ పేర్కొన్నారు. అయితే, తాము మాత్రం అలా భావించడం లేదన్నారు. పిల్లలను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోని వ్యసనపూరిత ఫీచర్లు, అతిగా అభ్యంతరకరమైన కంటెంట్‌, బాలికల చిత్రాల దుర్వినియోగం, ఏఐ రూపొందించే లైంగిక చిత్రాల నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం దశలవారీగా నిబంధనలు అమలు చేసే రోడ్‌మ్యాప్‌ను ప్రతిపాదించారు.

13–15 ఏళ్లకు ‘మినీ అకౌంట్లు’

13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు పరిమిత ఫీచర్లతో ‘మినీ అకౌంట్లు’ అందించాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. వీటిని నిర్దిష్ట సమయం మాత్రమే వినియోగించేలా పరిమితులు ఉంటాయి. తల్లిదండ్రుల పర్యవేక్షణ, నియంత్రణలోనే ఈ అకౌంట్లను నిర్వహించాల్సి ఉంటుంది. 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్ల కోసం సోషల్‌ మీడియా సంస్థలు మరింత సురక్షితమైన డిజైన్‌లను అందించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన మరిన్ని వివరాలు గురువారం వెల్లడయ్యే అవకాశం ఉంది. యూరోపియన్‌ యూనియన్‌లోని మొత్తం 27 దేశాల్లో ఈ నిబంధనలు అమలుకు ప్రతిపాదించారు.

అల్గారిథమ్‌లపైనా ఆప్షన్‌

సోషల్‌ మీడియా అల్గారిథమ్‌లను ఆఫ్‌ చేసుకునే అవకాశం వినియోగదారులకు కల్పించాలని యూరోపియన్‌ పార్లమెంట్‌లోని అతిపెద్ద గ్రూప్‌ అధినేత మాన్‌ఫ్రెడ్‌ వెబర్‌ ప్రతిపాదించారు. ఇదే సమయంలో కృత్రిమ మేధ (ఏఐ) విషయంలో కెనడా, బ్రిటన్‌తో కలిసి పనిచేయాలని లేయెన్‌ పిలుపునిచ్చారు. ఏఐ మోడళ్ల మూల్యాంకనం, వెరిఫికేషన్‌, ముందస్తు హెచ్చరికలు, ఏఐ భద్రత వంటి అంశాల్లో పరస్పర సహకారం అవసరమన్నారు. పిల్లల భద్రత దృష్ట్యా సోషల్‌ మీడియా సంస్థలపై నియంత్రణలను కఠినతరం చేసేందుకు స్పెయిన్‌, పోర్చుగల్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, అమెరికా ఇప్పటికే చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈయూ తాజా ప్రతిపాదన చేసింది.

P

Written By

Pradeep

Reporter

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు