నల్లగొండలో ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలు.. నవంబర్‌ 15 నుంచి 18 వరకు నిర్వహణ

నల్లగొండలో నవంబర్‌ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. శు

8 ఆగస్టు, 2026 6:31 PM•ByRalin

Share this article

నల్లగొండలో ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలు.. నవంబర్‌ 15 నుంచి 18 వరకు నిర్వహణ

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభల లోగోను ఆవిష్కరిస్తున్న జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌, తీగల సాగర్‌ తదితరులు

హైదరాబాద్‌, ఆగస్టు 8(జనవాణి): నల్లగొండలో నవంబర్‌ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహాసభల లోగోను ఆవిష్కరించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలకు చాటిచెప్పే లక్ష్యంతో మహాసభలను నల్లగొండలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 1936 ఏప్రిల్‌ 11న లక్నోలో స్థాపించబడిన ఏఐకేఎస్‌.. 90 ఏళ్లుగా రైతాంగ హక్కుల కోసం పోరాడుతోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు నాలుగు జాతీయ మహాసభలు జరిగాయని, ప్రతి మహాసభ రైతాంగ ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందని చెప్పారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి 80 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వీర తెలంగాణ పోరాటానికి కేంద్రంగా నిలిచిన నల్లగొండలో ఈసారి జాతీయ మహాసభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆరోపించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, మహిళా రైతులు, వలస కార్మికులు పెద్దఎత్తున ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, న్యూజిలాండ్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తదితర దేశాలతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాల వల్ల దిగుమతి సుంకాలు లేకుండా పత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌, ధాన్యాలు, పాల ఉత్పత్తులు దేశంలోకి వస్తే భారత రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం కేంద్రాన్ని వెనక్కి తగ్గేలా చేసిందని నేతలు పేర్కొన్నారు. ఆ ఉద్యమంలో 736 మంది రైతులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ధాన్యం నిల్వ సౌకర్యాలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడం ద్వారా వ్యవసాయ రంగంలో గుత్తాధిపత్యానికి అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు.

పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, వ్యవసాయానికి సబ్సిడీలు పెంచాలని, రైతులను రుణ విముక్తులను చేయాలని, రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు, పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.

ఆగస్టు 10న సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ‘జైల్‌ భరో’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలను విజయవంతం చేసేందుకు రైతులు, రైతు శ్రేయోభిలాషులు ఆర్థిక, హార్దిక సహకారం అందించాలని కోరారు.

కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం సీనియర్‌ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరిబండి ప్రసాద్‌రావు, కోశాధికారి మూడ్‌ శోభన్‌, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.జె.వినోద్‌, కార్యదర్శి కట్టా నరసింహ, రచయిత దేవేంద్ర, కాకం అంజన్న, ఆనంద్‌, చుక్కా రామనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు