అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టురట్టయింది. భారత్‌కు భారీగా మత్తుపదార్థాలను తరలిస్తున్న ఓ అనుమానాస్పద పడవను భారత తీరరక్షక దళం (Indian Coast Guard), గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Gujarat ATS) సంయుక్త ఆపరేషన్‌లో అడ్డుకుంది. ఇరాన్‌కు చెందిన ఈ పడవలో భారీగా మత్తుపదార్థాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పడవలో ఉన్న ఐదుగురు పాకిస్థాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు.
అధికారుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 25న లక్షద్వీప్ సమీపంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. విశ్వసనీయ నిఘా సమాచారంతో అనుమానాస్పదంగా కదులుతున్న ఓ ధావ్ పడవను భద్రతా బలగాలు గుర్తించాయి. సముద్ర, వైమానిక నిఘా వ్యవస్థల ద్వారా దాని కదలికలను నిరంతరం పర్యవేక్షించిన అధికారులు అనంతరం పడవను వెంబడించి లక్షద్వీప్‌కు పశ్చిమ దిశలో అడ్డుకున్నారు.
పడవను తమ ఆధీనంలోకి తీసుకున్న అనంతరం అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 526 కిలోల మెథాంఫెటామైన్, హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాల విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్‌తో పాటు పడవలో ఉన్న ఐదుగురు పాకిస్థాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన పడవ, నిందితులు, స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాలను భద్రతా బలగాల పర్యవేక్షణలో ముంబైకి తరలించారు.
ముంబైలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్ ఎవరిది? అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు. తాజా ఘటనతో సముద్ర మార్గాల ద్వారా జరుగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణాపై భద్రతా సంస్థలు మరింత దృష్టి సారించాయి. ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




















