ఫీజు బకాయిలు చెల్లించలేరు.. విదేశీ వర్సిటీలను తెస్తారా?: రేవంత్‌ సర్కార్‌పై బండి సంజయ్‌ ఫైర్‌

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వేలాది విద్యాసంస్థలు బకాయిల కారణంగా సంక్షోభంలో ఉంటే.. విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

25 ఆగస్టు, 2026 4:16 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఫీజు బకాయిలు చెల్లించలేరు.. విదేశీ వర్సిటీలను తెస్తారా?: రేవంత్‌ సర్కార్‌పై బండి సంజయ్‌ ఫైర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 25 (జనవాణి): తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోయి విద్యాసంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను తీసుకొస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘ఉట్టికి ఎగరలేనమ్మా.. స్వర్గానికి నిచ్చెనలేస్తా అన్నట్లుంది ముఖ్యమంత్రి వ్యవహార శైలి’’ అని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

రూ.15 వేల కోట్ల బకాయిలు

ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, నర్సింగ్‌ తదితర కోర్సులు నిర్వహిస్తున్న వేలాది కళాశాలలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలతో ఇబ్బందులు పడుతున్నాయని బండి సంజయ్‌ తెలిపారు. గత ఐదేళ్లుగా బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో దాదాపు రూ.15 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. జీతాలు, నిర్వహణ ఖర్చులు చెల్లించలేక కళాశాలల యాజమాన్యాలు అప్పుల పాలవుతున్నాయని, ఇప్పటికే కొన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల ఇబ్బందులు

ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వబోమని కొన్ని ప్రైవేట్‌ కళాశాలలు చెబుతున్నాయని బండి సంజయ్‌ అన్నారు. దీంతో విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక, పైచదువులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొందరు కుటుంబ ఆస్తులు అమ్ముకుని ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లిస్తామని సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. హామీలివ్వడం, మోసం చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మించిపోయిందని విమర్శించారు.

రామచంద్రరావు దీక్షకు మద్దతు

ఫీజు బకాయిల సమస్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచంద్రరావు చేపట్టిన ‘ఫీజు బకాయి–బీజేపీ లడాయి’ దీక్షకు బండి సంజయ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్యార్థులు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యపై ఉద్యమిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, కళాశాలల మనుగడను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బకాయిలు చెల్లించే వరకు రామచంద్రరావు ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని, త్వరలోనే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని బండి సంజయ్‌ హెచ్చరించారు. భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు