హైదరాబాద్, ఆగస్టు 8 (జనవాణి): బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగాలని బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు నిర్ణయించారు. బీసీల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, కులగణన తదుపరి ప్రక్రియ, ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో సమావేశం జరిగింది.
సమావేశంలో రాష్ట్రంలో బీసీ వర్గాల అభ్యున్నతికి చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. బీసీలకు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేయాలని నిర్ణయించారు.
పూలే దంపతుల విగ్రహావిష్కరణ 14న
హైదరాబాద్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఈ నెల 14న ప్రారంభించేందుకు నిర్ణయించారు. అలాగే ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాల ఆవిష్కరణను ఈ నెల 18న నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కలిసి ఆహ్వానించాలని సమావేశంలో నిర్ణయించారు. పూలే దంపతుల ఆశయాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని, విగ్రహావిష్కరణ సభలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, బీసీ కుల సంఘాల ప్రతినిధులు, బీసీ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు.
కులగణనపై తదుపరి అడుగులు
రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టిన నేపథ్యంలో తదుపరి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఐక్యంగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి తగిన నిధులు కేటాయించే అంశంపై కృషి చేయాలని నిర్ణయించారు. బీసీ కమిషన్‌ను మరింత బలోపేతం చేసి, బీసీల సమస్యల పరిష్కారంలో అవసరమైన సహకారం అందించాల్సిన అవసరంపై కూడా చర్చించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై దృష్టి
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడతల వారీగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోందని నాయకులు పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి
బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. బీసీ వర్గాల ఆర్థిక సాధికారతకు ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన నిధులు కేటాయించేలా కృషి చేయాలని నిర్ణయించారు.
ఆత్మగౌరవ భవనాలకు వేగం
వివిధ బీసీ కుల సంఘాలకు కేటాయించిన ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అవసరమైన నిధులను త్వరగా కేటాయించి నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చర్చించారు.
పార్టీ బలోపేతంపై ప్రత్యేక కార్యాచరణ
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. బీసీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలోని బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఐక్యంగా ముందుకు సాగాలని సమావేశం నిర్ణయించింది.
సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్‌ఠాకూర్, నవీన్ యాదవ్, ఈర్లపల్లి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.




















