రేప‌ట్నుంచి ‘బొడ్డెమ్మ’ పండుగ‌..9 రోజుల పాటు కన్నెపిల్లలు చేసే ఈ పండుగ ప్రత్యేకత ఇదే!

తెలంగాణ సంస్కృతిలో ప్రకృతికి, పూలకు, స్త్రీ జీవితానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే పండుగల్లో బొడ్డెమ్మ ఒకటి. ముఖ్యంగా కన్నెపిల్లలు మంచి భర్త రావాలని కోరుకుంటూ బొడ్డెమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. సాధారణంగా 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ముగిసిన మరుసటి రోజు నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి.

30 సెప్టెంబర్, 2026 5:03 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రేప‌ట్నుంచి ‘బొడ్డెమ్మ’ పండుగ‌..9 రోజుల పాటు కన్నెపిల్లలు చేసే ఈ పండుగ ప్రత్యేకత ఇదే!

Social Media Images

Boddemma Festival | సెప్టెంబర్ 30 (జనవాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రకృతిలో లభించే పూలను పూజిస్తూ వాటితో పండుగలు నిర్వహించడం తెలంగాణ ప్రత్యేకత. అలాంటి సంప్రదాయ పండుగల్లో బొడ్డెమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. బతుకమ్మకు ముందు వచ్చే ఈ వేడుకలను ముఖ్యంగా కన్నెపిల్లలు, మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.

బొడ్డెమ్మ పండుగను సాధారణంగా భాద్రపద మాసంలో మహాలయ అమావాస్యకు ముందు బహుళ పంచమి నుంచి 9 రోజుల పాటు నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఆచారాలను బట్టి మూడు లేదా ఐదు రోజుల పాటు కూడా జరుపుకుంటారు. ఈ పండుగను ‘బొడ్డెమ్మల పున్నమి’ అని కూడా పిలుస్తారు. పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని కోరుకుంటూ బొడ్డెమ్మను పూజించడం ఈ పండుగలో ప్రధాన సంప్రదాయం.

boddemma

బొడ్డెమ్మకు ఐదు రూపాలు

ప్రాంతాన్ని బట్టి బొడ్డెమ్మను తయారు చేసే విధానంలో మార్పులు కనిపిస్తాయి. సంప్రదాయంగా బొడ్డెమ్మను పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అనే ఐదు రకాలుగా పిలుస్తారు. వీటిలో పీట బొడ్డెమ్మ ఎక్కువగా కనిపిస్తుంది. చెక్క పీటపై పుట్టమన్నుతో గుండ్రంగా ఐదు వరుసలుగా పేర్చి, పైభాగంలో గోపురం ఆకారం వచ్చేలా బొడ్డెమ్మను రూపొందిస్తారు. దానిపై చిన్న గిన్నెను ఉంచి, అందులో పసుపుతో చేసిన గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు.

పాటలు, కోలాటాలతో బొడ్డెమ్మ వేడుక

బొడ్డెమ్మను ఏర్పాటు చేసే ప్రదేశాన్ని ముందుగా శుభ్రం చేసి, ఎర్రమట్టితో అలికి ముగ్గులు వేస్తారు. అనంతరం బొడ్డెమ్మను వివిధ రకాల పూలతో అందంగా అలంకరిస్తారు. కన్నెపిల్లలు, బాలికలు బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడుతూ కోలాటం ఆడుతారు. ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్‌.. బిడ్డలందరూ కోల్‌..’ అంటూ పాటలు పాడుతూ వేడుకను నిర్వహిస్తారు. అనంతరం బొడ్డెమ్మను నిద్రపుచ్చే సంప్రదాయ పాటలను ఆలపిస్తారు. ఇలా ప్రతిరోజూ పూజలు, పాటలు, కోలాటాలతో బొడ్డెమ్మ వేడుక కొనసాగుతుంది.

boddemma2

బొడ్డెమ్మ పండుగ మూలాలు

‘బొడ్డ’ అనే పదానికి అత్తి చెట్టు, మేడిచెట్టు లేదా ఔదుంబర వృక్షం అనే అర్థాలు కూడా ఉన్నట్లు సంప్రదాయ విశ్వాసాలు చెబుతున్నాయి. ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని భావిస్తారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, సంతాన సాఫల్యంతో దీనికి సంబంధం ఉందనే నమ్మకాలు ఉన్నాయి. ప్రకృతి, చెట్లు, మహిళల జీవితం మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా బొడ్డెమ్మ పండుగను నిర్వహించడం తెలంగాణ పల్లె సంస్కృతిలో కనిపిస్తుంది.

ఎక్కడెక్కడ జరుపుకుంటారు?

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బొడ్డెమ్మ పండుగను నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సంప్రదాయం కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని కొన్ని గిరిజన ప్రాంతాల్లోనూ స్థానిక ఆచారాలకు అనుగుణంగా బొడ్డెమ్మను జరుపుకుంటారు. అడవులతో మమేకమైన ఈ ప్రాంతాల్లో చెట్లు, మొక్కల ఔషధ గుణాలపై స్థానికులకు ఉన్న అవగాహన కూడా ఈ సంప్రదాయంతో ముడిపడి ఉందని భావిస్తారు.

బొడ్డెమ్మ తర్వాత బతుకమ్మ

తొమ్మిది రోజుల వేడుకలు పూర్తయ్యాక బొడ్డెమ్మను చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. బొడ్డెమ్మతో పాటు గత రోజుల్లో ఉపయోగించిన పూలను కూడా నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా సంప్రదాయ పాటలు పాడుతూ బొడ్డెమ్మకు వీడ్కోలు పలుకుతారు. ‘పోయిరా బొడ్డెమ్మ.. పోయిరావమ్మా’ అంటూ బొడ్డెమ్మను సాగనంపిన అనంతరం మరుసటి రోజు నుంచి తెలంగాణలో ఎంతో వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. అందుకే బొడ్డెమ్మను బతుకమ్మకు ముందుగా వచ్చే ముఖ్యమైన తెలంగాణ పూల పండుగగా చెప్పుకోవచ్చు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు