హైదరాబాద్, ఆగస్టు 9 (జనవాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ వాసుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా ఆషాఢ మాస బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు.. బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ కల్యాణం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర, లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. వందల ఏళ్లుగా హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని, గతంలో నిజాం పాలనలోనూ ఈ వేడుకలు నిర్వహించారని గుర్తుచేశారు.
అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, రైతులు, ప్రజలు ఆనందంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల జీవితాల్లో సంతోషం, సంపద వెల్లివిరియాలని కోరుకున్నారు.
బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. ఆలయాల వద్ద భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. నగరంలో ఎక్కడ చూసినా డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, అమ్మవారి ఘటాలు, భక్తుల సందడి కనిపిస్తోందన్నారు.
హైదరాబాద్ బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు, భక్తులు, ఆలయ నిర్వాహకులు, అధికారులు సమన్వయంతో వేడుకలను విజయవంతం చేస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయికుమార్, సరితా తిరుపతయ్య యాదవ్, భాస్కర్, అజయ్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, పోలీస్ కమిషనర్ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా తదితరులు పాల్గొన్నారు.





















