హైదరాబాద్, ఆగస్టు 6 (జనవాణి): తెలంగాణలో విద్యారంగం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కాదని తేలిపోయిందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేవలం 5.98 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తోందని ఆర్‌బీఐ నివేదికలో తేలిందని.. ఇది ఆందోళనకరమన్నారు.
బిహార్ వంటి రాష్ట్రాలు విద్యకు 20 శాతం వరకు నిధులు వెచ్చిస్తుండగా, తెలంగాణలో విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారని ఏనుగుల రాకేశ్ రెడ్డి విమర్శించారు. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలను చదువుకు దూరం చేస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యా శాఖ మంత్రిగా ఉండి ఎందుకు నిధులు ఖర్చు పెట్టడం లేదని ప్రశ్నించారు. మూసీ కోసం, ఫ్యూచర్ సిటీ కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి టీ షర్ట్, షూస్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారని అన్నారు. రరేవంత్ రెడ్డి జల్సాల కోసం ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి.. డిప్యూటీ సీఎం భట్టి తాగే వాటర్ బాటిల్ ధర వేలల్లో ఉంది.. కానీ విద్యకు మాత్రం ఖర్చు చేయడం లేదన్నారు.
మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ వంటి కార్యక్రమాలకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, విద్యారంగానికి మాత్రం నిధులు కేటాయించడం లేదని రాకేష్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టంతా ఫ్యూచర్ సిటీపై మాత్రమే ఉందని, ప్రభుత్వ పాఠశాలలను 27 వేల నుంచి నాలుగు వేలకు కుదిస్తామని చెప్పడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే డీఈవోలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు వెనుక ప్రభుత్వం బంధువులకు కాంట్రాక్టులు కట్టబెట్టే ఉద్దేశమే ఉందని ఆరోపించారు. విద్యా కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందనే వివరాల కోసం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేస్తానని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనివల్ల 23 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని కూడా రాకేష్ రెడ్డి ఆరోపించారు.





















