అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ వర్సెస్ పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల దుస్తులతో వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. బనియన్‌తో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకోగా, కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను కూడా అరెస్ట్ చేశారు.

7 సెప్టెంబర్, 2026 12:06 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ వర్సెస్ పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (జనవాణి): తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు ప్రధాన ద్వారం వద్ద అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్‌ సభ్యులు నల్ల టీషర్ట్‌లు ధరించడం, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో వారిని లోనికి అనుమతించలేమని పోలీసులు తెలిపారు.

దీంతో పోలీసులకు, బీఆర్‌ఎస్‌ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తన టీషర్ట్‌ను విప్పి బనియన్‌తో అసెంబ్లీ గేటు వద్ద నిరసన తెలిపారు. అనంతరం బనియన్‌తోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని, అరెస్ట్ చేయడానికి కారణమేంటని పోలీసులను ప్రశ్నించారు. అసెంబ్లీలోకి వెళ్లకుండా ప్రతిపక్ష సభ్యులను అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నిర్వహించడం ప్రజా పాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఎంతకాలం పాలన సాగిస్తుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద నిరసనకు దిగిన కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నేతలకు మధ్య జరిగిన తోపులాటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కిందపడిపోయినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో నల్లరంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకుని చీరను లాగారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. మహిళలమని కూడా చూడకుండా కాళ్లను తొక్కారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అయితే అనంతరం పలువురు బీఆర్‌ఎస్‌ సభ్యులను అసెంబ్లీలోకి అనుమతించారు.

గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్‌ నివాళులు

అసెంబ్లీకి రాకముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహించడం సరికాదని, అన్ని అంశాలపై చర్చ జరిగేలా స్పీకర్ చొరవ తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన ఏడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తెలిపారు. అలాగే 22A పేరిట జరుగుతున్న కుంభకోణంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు