తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, అనిల్ జాదవ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేసినా... ఉమ్మడి పాలకులు ఎవరూ పట్టించుకోలేదని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో బోనాలను అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రూ. 1,800 కోట్లతో అభివృద్ధి చేసి నిర్మించామని తెలిపారు. బోనాల సందర్భంగా ప్రతి ఆలయ కమిటీకి నిధులు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించామన్నారు.





















