సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో ఆదివారం నాడు బోనాల సంబురాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బోనాల విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, పలువురు ఎంపీుల, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా విచ్చేసిన అతిథులందరికీ తెలంగాణ సంప్రదాయ వంటకాలతో ఆతిథ్యం అందించడం సంతోషకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వారందరితో ఆత్మీయంగా ముచ్చటిస్తూ ఈ పండుగ విశిష్టతను పంచుకోవడం మరింత సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా తల్లి మల్లమ్మ, నా సతీమణి మంజుల, కుమారులు పృథ్వీ, ప్రణవ్, మా సోదరులు, కుటుంబ సభ్యులు, బంధువులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారని అన్నారు.

బోనాల ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి, సంప్రదాయం, తెలంగాణ ఆతిథ్యానికి ప్రతీకగా నిలవడంతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఆత్మీయ సమావేశంగా నిలిచిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పవిత్ర సందర్భంలో నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గ సహచరులకు, ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.





















