నిషేధిత భూముల జాబితాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల హక్కుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు కేసులు మినహా మిగతా భూములకు బై నంబర్లు ఇచ్చి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

14 ఆగస్టు, 2026 6:31 AM•ByRalin

Share this article

నిషేధిత భూముల జాబితాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్) నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనవాణి): నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూముల హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఏదైనా కారణంగా భూమి 22ఏలో చేరినా, కొనుగోలు చేసిన హక్కుదారుల స్థలాలు ఎక్కడికీ పోవని స్పష్టం చేశారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించిన సర్వే నంబర్లలోని మొత్తం భూములను నిషేధిత జాబితాలో చేర్చారని, కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలను పక్కనపెట్టి మిగతా వాటికి బై నంబర్లు ఇచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్) నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.

కూకట్‌పల్లి ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి శ్రీధర్‌బాబుకు సీఎం సూచించారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణ, పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో గత పాలన, ప్రస్తుత రెండేళ్ల పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఏవీ నిలిపివేయలేదని, అదనంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

రాష్ట్రంలో 3.28 కోట్ల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అందిస్తున్నామని సీఎం చెప్పారు. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశామని తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఉద్యోగ, ఉపాధి, చదువుల కోసం వెళ్లేవారు నెలకు రూ.6-7 వేల వరకు ఆదా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్టీసీకి రూ.12 వేల కోట్లు చెల్లించామని, స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించి రూ.2,500 కోట్ల వడ్డీ చెల్లించామని వివరించారు.

మహిళా సంఘాల పేరిట వెయ్యి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చామని, వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం కల్పించామని సీఎం తెలిపారు. ఆదిలాబాద్‌ అడవుల నుంచి అచ్చంపేట వరకు మహిళలు తయారు చేసిన వస్తువులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా బజార్ల ఏర్పాటుకు విలువైన స్థలం కేటాయించామని చెప్పారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు.

కూకట్‌పల్లిలో వందల కోట్ల విలువైన 11 ఎకరాల భూమిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. నగరంలో నిరుపేదలు ఎక్కడ నివసిస్తున్నారో వారికి అక్కడే ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. పేదల కోసం నిర్మించే ఇళ్లకు రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేయాలని మంత్రులకు సూచించారు. ఇళ్ల నిర్మాణానికి స్థలాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని, నిర్మాణ వ్యయంలో రూ.5-6 లక్షలు లబ్ధిదారులు భరిస్తే నిర్మాణం జరుగుతున్న సమయంలో పనులను పరిశీలించే హక్కుదారులవుతారని వివరించారు.

నిరుపేదలకు సొంత ఇళ్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం తెలిపారు. మొదటి విడతగా కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా పేదలు నివసించే ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన వారికి ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో ఏదైనా పని కోసం గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రజల సౌలభ్యం కోసం సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేశామని చెప్పారు.

‘‘మీ అభివృద్ధి కోసం నిలబడతా. పది మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. మంచి చేయడానికి చిత్తశుద్ధి, మంచి ఆలోచన కావాలి. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి రోజుకు 18 గంటలు పనిచేయడానికి దేవుడు శక్తినిచ్చారు. అందుకు ప్రజలు ఆశీర్వదించాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు