హైదరాబాద్, సెప్టెంబర్ 7 (జనవాణి): శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్పీకర్ చైర్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో ముందుగా చర్చలు జరిగి.. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారని సీఎం అన్నారు. నిర్ణయాలు తీసుకున్న తర్వాత చర్చలు జరగవని పేర్కొన్నారు. బీజేపీ లేవనెత్తిన అంశాలపైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే స్పీకర్ చైర్‌ను అవమానించినప్పుడు బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
సభ్యుల హక్కులను కాపాడే స్పీకర్‌ను అత్యంత అవమానకరంగా ఉద్దేశించి మాట్లాడటం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని రేవంత్ రెడ్డి అన్నారు. ఇది కేవలం స్పీకర్‌కు జరిగిన అవమానం కాదని.. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగిన అవమానమని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ నేతలు సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. దళితులు, గిరిజనులకే కాకుండా మొత్తం సభ్య సమాజానికే ఇది అవమానమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసిన ఘనత కూడా కేసీఆర్‌దేనని ఆరోపించారు.
దళిత వ్యక్తిని ఉన్నతమైన పదవిలో చూడలేకపోతున్నారని బీఆర్‌ఎస్‌పై రేవంత్ విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ తన దళిత వ్యతిరేక ఆలోచనా విధానాన్ని మార్చుకోకపోతే భవిష్యత్ తరాలు ఈ సభను క్షమించవని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్‌పై అభ్యంతరకర భాష ఉపయోగించిన ఎమ్మెల్సీ తాతా మధుతో రాజీనామా చేయించాలని, లేదంటే ఆయనను బీఆర్‌ఎస్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. తాతా మధు వంటి నేతలు తాము మాట్లాడే ప్రతి మాట వెనుక కేసీఆర్ ప్రోత్సాహం ఉందన్న భావనతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సీఎం తీవ్రంగా విమర్శించారు.




















