భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తర భారత ప్రతినిధులతో శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పెట్టుబడులకు అవసరమైన భద్రత, మౌలిక వసతులు, విధానపరమైన స్థిరత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు.
ప్రభుత్వాలు మారినా.. పాలసీలు మారవు
తెలంగాణలో ప్రభుత్వం మారినా పారిశ్రామిక విధానాలు మారవని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన మంచి విధానాలను కూడా కొనసాగిస్తూనే, తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చిందన్నారు.
చంద్రబాబు నాయుడు హయాంలో హైదరాబాద్‌కు ఐటీ పెట్టుబడులు, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు వచ్చారని, కాంగ్రెస్ పాలనలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా, ఐటీ రంగాలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని విధానాలను కూడా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
ఫార్చ్యూన్-500 కంపెనీలే లక్ష్యం
భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోని ఫార్చ్యూన్-500 కంపెనీలు పెట్టుబడులు పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వేగంగా విస్తరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా సుమారు 5 శాతంగా ఉందని, దాన్ని 10 శాతానికి పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
క్యూర్.. ప్యూర్.. రేర్
భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించినట్లు సీఎం వివరించారు.
* CURE (Core Urban Region): ఔటర్ రింగ్ రోడ్ లోపల సర్వీస్ రంగానికి ప్రాధాన్యం.
* PURE (Planned Urban & Regional Expansion): ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ వరకు తయారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహం.
* RARE (Rural, Agriculture & Resource Economy): రీజినల్ రింగ్ రోడ్ వెలుపల వ్యవసాయం, అగ్రి ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యం.
ఈ ప్రాంతాల్లో పరిశ్రమలకు అవసరమైన భూములు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
మచిలీపట్నం వరకు 12 లేన్ల కారిడార్
భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని సీఎం వెల్లడించారు. వివిధ రంగాలకు ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
బుల్లెట్ ట్రైన్లు.. కొత్త ఎయిర్‌పోర్టులు
వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్రం అనుమతులు ఇచ్చిందని సీఎం తెలిపారు. అలాగే కేంద్రం ప్రకటించిన ఏడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల్లో మూడు తెలంగాణకు రావడం రాష్ట్రానికి ప్రయోజనకరమన్నారు. శంషాబాద్-చెన్నై, శంషాబాద్-పుణె, శంషాబాద్-బెంగళూరు మార్గాల్లో బుల్లెట్ ట్రైన్లు ప్రతిపాదితంగా ఉన్నాయని చెప్పారు.
ఏఐ ప్రభావం.. స్కిల్‌పైనే ఫోకస్
కృత్రిమ మేధ (AI) ప్రభావంతో వైట్ కాలర్ ఉద్యోగాల స్వరూపం మారుతున్న నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేశామని, దానికి ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా, ప్రముఖ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు డైరెక్టర్లుగా ఉన్నారని తెలిపారు.
ఏటీసీలతో 100 శాతం ఉపాధి
రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) మారుస్తున్నామని, అక్కడ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు బోధించడం వల్ల శిక్షణ పొందిన విద్యార్థులకు 100 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయని సీఎం తెలిపారు.
భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లోని గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లలో (GCCs) ఇప్పటికే 200 కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయని సీఎం వెల్లడించారు. అమెజాన్ డేటా సెంటర్లపై రూ. లక్ష కోట్ల పెట్టుబడి, అదానీ గ్రూప్ రూ.35 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణపై సీఐఐ ప్రశంసలు
సీఐఐ ఉత్తర భారత ప్రాంత చైర్మన్ పునీత్ కౌరా మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక విధానాలు పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు, వేగవంతమైన పరిపాలన కారణంగానే ఈసారి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను అధ్యయనం చేసేందుకే ప్రతినిధుల బృందం వచ్చిందని పేర్కొన్నారు.




















