సంగారెడ్డి, ఆగస్టు 15 (జనవాణి): తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. భవిష్యత్‌లో ఏర్పడే ఖాళీలను దృష్టిలో పెట్టుకుని నియామక ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే జరిగిందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 70 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని సీఎం తెలిపారు. ఇందులో 10 వేల మంది నర్సులకు ఉద్యోగాలు కల్పించామని, మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు. నిరుద్యోగులు జాగ్రత్తగా చదివి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితిని కూడా పెంచామని రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏ ఖాళీలను కూడా గాలికి వదిలేయను.. నియామకాలు చేపట్టి పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తా అని హామీ ఇచ్చారు.
మాయమాటలు నమ్మొద్దు
కొంతమంది మాయమాటలు చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారి మాటలు నమ్మకుండా పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత తనదేనని, అభ్యర్థులు మాత్రం పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మాట ఇస్తే చివరి వరకు నిలబడే నాయకత్వం తమదేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతను రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టి వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే కుట్రలకు దూరంగా ఉండాలని సూచించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం, యువతను ఆదుకోవడం తమ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.




















