దానం నాగేందర్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. బుధవారం విచారణ

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించిన అనర్హత కేసు మరో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌ను బుధవారం విచారణ జాబితాలో చేర్చేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంగీకరించారు.

21 సెప్టెంబర్, 2026 2:15 PM•ByNarender Kumar Nangunoori

Share this article

దానం నాగేందర్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. బుధవారం విచారణ

ఢిల్లీ, సెప్టెంబర్ 21 (జనవాణి): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత కేసు సుప్రీం కోర్టుకు చేరింది. తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం (సెప్టెంబర్ 21) సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. దానం నాగేందర్ పిటిషన్‌ను బుధవారం విచారణ జాబితాలో చేర్చేందుకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

అసలు వివాదం ఏంటి?

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరినందున దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అంశంపై విచారణ చేపట్టిన అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ దానం నాగేందర్ చట్టపరంగా పార్టీ మారలేదని పేర్కొన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనను అనర్హుడిగా ప్రకటించేందుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేసిన పిటిషన్లు

స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తీర్పులో భాగంగా దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. బీఆర్ఎస్ సభ్యుడిగా ఉంటూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన విషయాన్ని ప్రస్తావించిన హైకోర్టు.. 2024 ఏప్రిల్ 23 నుంచి ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా పరిగణించాలని ఆదేశించింది. తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా అనర్హత ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయాలన్న దానం నాగేందర్ తరఫు న్యాయవాది అభ్యర్థనను కూడా హైకోర్టు తిరస్కరించింది.

దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే పరిస్థితి వచ్చినా తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ ఇప్పటికే వెల్లడించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు