హైదరాబాద్, ఆగస్టు 12 (జనవాణి): రాయదుర్గంలోని ప్రతిపాదిత PM ఏక్తా యూనిటీ మాల్ ప్రాజెక్టులో భారీ అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మల్కం చెరువు ఎదురుగా ఉన్న 6.3 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమి, కేంద్ర ప్రభుత్వం అందించే రూ.202 కోట్ల నిధుల వినియోగంపై ఆయన తీవ్రస్థాయిలో ప్రశ్నలు లేవనెత్తారు. టెండర్ ప్రక్రియలో రిగ్గింగ్ జరిగిందని, ప్రైవేట్ సంస్థలకు ప్రయోజనం కలిగేలా నిబంధనలు రూపొందించారని ఆరోపించారు.
రూ.1,700 కోట్ల ప్రభుత్వ భూమిపై ప్రశ్నలు
రాయదుర్గంలోని 6.3 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.1,700 కోట్లు ఉంటుందని శ్రవణ్ పేర్కొన్నారు. ఈ భూమితో పాటు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.202 కోట్ల సాయాన్ని కలిపితే ప్రాజెక్టు విలువ రూ.2,059.81 కోట్లుగా అంచనా వేసినట్లు తెలిపారు. ఇంత విలువైన ప్రజా ఆస్తిని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రయోజనం చేకూరేలా వినియోగిస్తున్నారని ఆరోపించారు.
ప్రతిపాదిత ప్రాజెక్టులో మొత్తం 27 లక్షల చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియా ఉంటుందని శ్రవణ్ తెలిపారు. ఇందులో ప్రభుత్వానికి కేవలం 9 లక్షల చదరపు అడుగులు అంటే 33 శాతం మాత్రమే దక్కుతుండగా.. ప్రైవేట్ డెవలపర్‌కు 18 లక్షల చదరపు అడుగులు అంటే 67 శాతం కేటాయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వాటా కంటే రెట్టింపు నిర్మాణ హక్కులు ప్రైవేట్ సంస్థకు ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించారు.
భవిష్యత్తులో FSI సడలింపుల ద్వారా నిర్మాణ విస్తీర్ణం పెరిగితే ఆ అదనపు ప్రయోజనం ఎవరికి దక్కుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అదనపు నిర్మాణ విస్తీర్ణం ద్వారా వచ్చే ప్రయోజనాలు ప్రైవేట్ డెవలపర్‌కే దక్కేలా ఒప్పందాలు రూపొందించారా అనే విషయాన్ని కూడా వెల్లడించాలని కోరారు.
టెండర్లలో రిగ్గింగ్ జరిగింది
కొన్ని ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలను రూపొందించారని శ్రవణ్ ఆరోపించారు. వంశీరామ్ బిల్డర్స్, అపర్ణ బిల్డర్స్ కన్సార్టియం సహా ప్రైవేట్ సంస్థలతో జరిగిన టెండర్ ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. టెండర్‌లో ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి, ఎవరికి అర్హత కల్పించారు, ఎవరిని అనర్హులుగా ప్రకటించారు, ఫైనాన్షియల్ బిడ్లను ఎలా మూల్యాంకనం చేశారనే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
DPRలు, టెండర్ పత్రాలు, ఫైనాన్షియల్ మోడలింగ్ ఫైళ్లు, ఏరియా షేరింగ్ ఒప్పందాలు, FSI నిబంధనలు, ప్రైవేట్ కన్సార్టియంతో కుదిరిన ఒప్పందాలను ప్రజల ముందుంచాలని కోరారు. టెండర్లను వెంటనే రద్దు చేసి మొత్తం ప్రక్రియను సమీక్షించాలని డిమాండ్ చేశారు.
ఏక్తా మాల్ లక్ష్యం పక్కదారి పడుతోందని ఆరోపణ
PM ఏక్తా యూనిటీ మాల్ ప్రధాన ఉద్దేశం రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని.. దేశవ్యాప్తంగా ODOP, GI ఉత్పత్తులు, చేనేత, హస్తకళలకు జాతీయ మార్కెట్ కల్పించడమేనని శ్రవణ్ అన్నారు. గద్వాల్, పోచంపల్లి చీరలు, పెంబర్తి ఇత్తడి కళ, వరంగల్ దుప్పట్లు, చేర్యాల చిత్రకళ, నిర్మల్ బొమ్మలు వంటి తెలంగాణ సంప్రదాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉందన్నారు.
దేశవ్యాప్తంగా ఏక్తా యూనిటీ మాల్స్‌ను ప్రధానంగా హస్తకళాకారుల కోసం సుమారు 2 లక్షల చదరపు అడుగుల స్థాయిలో రూపొందిస్తున్నారని, అయితే రాయదుర్గం ప్రాజెక్టును ఏకంగా 27 లక్షల చదరపు అడుగులకు ఎందుకు విస్తరించారో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు. ఈ విస్తీర్ణంలో హస్తకళాకారులు, ODOP, GI ఉత్పత్తులకు ఎంత స్థలం కేటాయిస్తున్నారు? ప్రైవేట్ వాణిజ్య సంస్థలకు ఎంత స్థలం ఇస్తున్నారు? అనే వివరాలను వెల్లడించాలని కోరారు.
బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
ప్రతిపాదిత PM ఏక్తా యూనిటీ మాల్ స్థలాన్ని బీఆర్‌ఎస్ నాయకులు శాంతియుతంగా క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని శ్రవణ్ ఆరోపించారు. ప్రజా ఆస్తిపై ప్రశ్నించడం నేరమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజాధనాన్ని పణంగా పెట్టి ఎంపిక చేసిన ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలు మార్చారన్న ఆరోపణలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ బీజేపీపై ప్రశ్నలు
కేంద్ర ప్రభుత్వం రూ.202 కోట్ల నిధులు అందిస్తున్న ప్రాజెక్టులో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నా తెలంగాణ బీజేపీ నాయకత్వం ఎందుకు స్పందించడం లేదని శ్రవణ్ ప్రశ్నించారు. కేంద్ర పథకం లక్ష్యం పక్కదారి పడుతోందన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి వివరాలను పరిశీలించాలని కోరారు. రాయదుర్గం PM ఏక్తా మాల్‌కు సంబంధించిన అన్ని టెండర్లు, కేటాయింపులు, ఒప్పందాలను తక్షణమే రద్దు చేసి సమీక్షించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. టెండర్లలో అవకతవకలు, భూ కేటాయింపులు, ఆర్థిక లావాదేవీలపై సీబీఐ లేదా సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు కేంద్రం అందించే రూ.202 కోట్ల నిధులపై సమీక్ష చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజా భూములు, కేంద్ర నిధులను ప్రైవేట్ ప్రయోజనాలకు వినియోగించడాన్ని బీఆర్‌ఎస్ అంగీకరించదని శ్రవణ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని, టెండర్లు రద్దయ్యే వరకు ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రాయదుర్గం PM ఏక్తా మాల్ టెండర్ పత్రాలు, ఆరోపణలపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.





















